మన్సూరాబాద్, నవంబర్ 11 : దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన ఉమేశ్ (23) క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అదే రాష్ర్టానికి చెందిన కార్తీక్ (20) సెంట్రింగ్ పనులు, నితిన్‌కుమార్ అలియాస్ మిట్టు (20) షాప్ కీపర్‌గా పనిచేస్తున్నారు. ఉమేశ్, కార్తీక్, నితిన్‌కుమార్ స్నేహితులు. జల్సాలకు అలవాటు పడి తమ కోరికలను తీర్చుకునేందుకు దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ ముగ్గురు కలిసి దొంగతనాలు చేసేందుకు బైక్‌పై నగరానికి వచ్చి.. రెండు రోజుల పాటు లాడ్జీల్లో మకాం వేస్తారు. లాడ్జీకి సమీపంలో ఉండే దేవాలయాల వివరాలను గూగుల్‌లో సెర్చ్ చేసి రెక్కీ నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న దేవాలయం మూసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో బైక్‌పై ఆలయం వద్దకు వెళ్లి.. లోనికి చొరబడుతారు. హుండీలను పగులగొట్టి నగదును అపహరిస్తారు.
ఈ క్రమంలో హయత్‌నగర్, తొర్రూర్ క్రాస్ రోడ్డులోని షిర్డీ సాయిబాబా ఆలయంలోకి 2024, సెప్టెంబర్ 12న చొరబడి హుండీలోని నగదును తస్కరించారు.
అదేవిధంగా.. మన్సూరాబాద్, సెంట్రల్బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయంలో 2024, అక్టో బర్ 25న హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు. సెంట్రల్ బ్యాంకు కాలనీలోని శ్రీ ఉమానాగలింగేశ్వర స్వామి దేవాలయం మేనేజర్ బొశెట్టి లింగయ్య ఆ మరుసటి రోజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. ఎల్బీనగర్ పోలీసులు సోమవారం ఉదయం సీరిస్ రోడ్డులోని డీవీఎం కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఉమేశ్, కార్తీక్, నితిన్‌కుమార్ బైక్‌పై అటువైపు వచ్చారు. పోలీసులను చూసిన ముగ్గురు బైక్‌ను వదిలేసి పారి పోయేందుకు ప్రయత్నించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.40 వేల నగదు, 3 సెల్ఫోన్లు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన ఉమేశ్, కార్తీక్, నితిన్‌కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.