Pharma City | కందుకూరు, జూలై 6 : ఫార్మాసిటీలో భూముల కోల్పోయిన రైతులకు ఈనెల 7వ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి. రైతులకు ప్లాట్ల ఎంపికలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 7వ తేదీన 60 గజాల వారిని, 8వ తేదీన 121 గజాల వారిని, 9వ తేదీన 181 గజాల వారిని, 10వ తేదీన 181 గజాల పైబడిన వారిని ఎంపిక చేయనున్నారు.
సోమవారం ఉదయం 8 గంటలకు బేకరికంచ వద్ద గల లేఔట్లో లక్కీ డ్రా నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు ఎకరాకు 121 గజాల ప్లాట్లను కేటాయించడానికి పట్టా సర్టిఫికెట్లను అందజేసింది. లక్కీ డ్రాకు వచ్చే రైతులు ఈ సర్టిఫికెట్లతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, లేదా ఫామ్ నెంబర్ 60, ఫామ్ నెంబర్ 32, రెండు పాస్ ఫోటోలు తీసుకు రావాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్, ముచ్చర్ల, పంజగూడలో 2,432 మంది రైతులకు గాను 4వేల ఎకరాలకు ప్లాట్లను కేటాయిస్తారు. ప్లాట్ల కేటాయింపు సజావుగా నిర్వహించడానికి కృషి చేస్తున్నట్లు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. భూములు కోల్పోయిన రైతులు సకాలంలో పాల్గొనాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి లక్కీ లాటరీ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభిస్తారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో కార్యక్రమం కొనసాగుతుంది. రైతులకు రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాలు ముందుగా సేకరిస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ పత్రాలు రైతుల ఇండ్ల వద్దకే చేరుతాయి.
అధికారులకు శిక్షణ…
మండలం మీర్ఖాన్పేట్ శివారులో గల ఫార్మాసిటీ లేఔట్లో ప్లాట్ల పంపిణీ కార్యక్రమం లాటరీకి సంబంధించి సంబంధిత ఉద్యోగులందరికీ ఆదివారం శిక్షణ ఇచ్చారు. ప్లాట్ల డ్రా కోసం వచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే సరైన సలహాలు సూచనలు ఇచ్చారు. సజావుగా నిర్వహించాలని చెప్పారు. రైతులు వచ్చేటప్పుడు ఆధార్ జిరాక్స్ కాపీ, పాన్ కార్డు జిరాక్స్ కాపీ అట్లాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని కోరారు.