కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 25: కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు చినుకుగా మొదలై.. కాసేపు కుండపోతతో.. మరికాసేపు విరామాన్నిస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షంనీరు వరదలా రోడ్లపై ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. సామాన్య ప్రజానికం ఇంటినుంచి బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రోడ్లపై వర్షంనీటి ప్రవాహంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా ఇంటినుంచి బయటికి రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.
వర్షంనీటితో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో అత్యవసర బృందాలు రంగంలోకి దిగి నీటి నిల్వలను తొలగించే పనులను చేస్తున్నారు. వర్షంనీటి కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డంకిగా నిలిచిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. కాలువలన్నింటినీ పరిశీలిస్తూ నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగిస్తున్నారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మ్యాన్‌హోల్స్‌ను సరిచేయడం, క్యాచ్‌పిట్ ప్రాంతాలలో చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. తరచుగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించారు. రోడ్లపై పేరుకపోయిన మట్టి దిబ్బలను తొలగించే పనులను చేస్తున్నారు.
ముంపు సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు మాజీ కార్పొరేటర్ బాబూరావు అన్నారు. మంగళవారం బాలాజీనగర్ డివిజన్లోని శివశక్తినగర్, హబీబ్‌నగర్ ప్రాంతాల్లో వర్షంనీటి ముంపు సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించారు. వర్షంనీరు సజావుగా దిగువ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏదైనా సమస్య ఎదురైతే అధికారుల దృష్టికి తీసుకరావాలని కోరారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, ఏఈ శ్రీనివాస్, స్థానిక నేతలున్నారు.