సిటీబ్యూరో/బన్సీలాట్పేట, జూలై 28 (నమస్తే తెలంగాణ): రోగాల బారిన పడినవారికి నిండైన ఆరోగ్యం అందించే సర్కారు దవాఖానలు మురుగుకంపుతో దర్శనమిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చేవారికి మరిన్ని రోగాలను బహుమతిగా అందిస్తున్నాయి. దవాఖానల ప్రాంగణంలో మురుగుకంపు భరించలేక రోగులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. గాంధీ, ఉస్మానియా వంటి పెద్ద పెద్ద వైద్యశాలల్లోనే ఈ తరహా సమస్యలు దర్శనమిస్తుండటం గమనార్హం. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సమస్య తమ దృష్టికి వస్తేనే స్పందించి, పరిష్కరిస్తామని పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు.
సికింద్రాబాద్లో ఉన్న గాంధీ జనరల్ దవాఖానకు వైద్యం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి రోగులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో కంటే వర్షాకాలం వంటి సీజన్లో అత్యధిక శాతం మంది డెంగీ, మలేరియా, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో వైద్యం కోసం గాంధీ దవాఖానకు వస్తుంటారు. వారందరూ సకాలంలో వైద్య చికిత్సలు చేయించుకొని వైద్యులు చెప్పిన సూచనలు పాటిస్తూ, మెడిసిన్ వాడుతూ త్వరగా కోలుకోవాలని అనుకుంటారు. ఉన్న రోగాలతో పాటు కొత్త రోగాలను కూడా కొని తెచ్చుకుంటున్నారన్న సంగతి వారికి తెలియకపోవడం విడ్డూరం.
అదేలా అంటే చికిత్సనందించే 8 అంతస్తుల భవనం సెల్లారులో లీకైన డ్రైనేజీ వల్ల ఉన్న రోగాలతో పాటు కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. మొత్తం 8 అంతస్తులు ఉన్న భవనంలో పరిపాలన విభాగంతో పాటు ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, కార్డియోలజీ, ఫ్యామిలీ ప్లానింగ్, నెఫ్రాలజీ వంటి మొదలైన ముఖ్యమైన విభాగాలు ఉన్నాయి. ప్రతి అంతస్తులో పోగయ్యే డ్రైనేజీ పైపు లైన్ల ద్వారా కింద సెల్లార్లో ఉన్న డ్రైనేజీ స్టోరేజీలోకి వెళ్లేలా పైపులైన్లను బిగించారు. కొన్నిరోజులుగా డ్రైనేజీ నిండిపోయి బయటికి పొంగుతోంది. మురుగు నిలిచి అందులో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
నిలిచిన మురుగు దుర్గంధం వెదజల్లడంతో అటువైపు వెళ్లాలంటే కూడా జంకుతున్నారు. పక్కనే రోగుల బెడ్లకు వేసే బెడ్షీట్లు శుభ్రం చేసే ల్యాండ్రి సైతం ఉంది. శుభ్రం చేసిన దుస్తుల్లో సైతం దోమలు రోగులకు చేరుతున్నాయి. అదే మురుగు నీటిలోంచి దోమలు కిటికీల మీదుగా నేరుగా రోగికి చికిత్సనందించే బెడ్లపైకి చేరుతున్నాయి. ఒకవైపు మురుగుకంపు, మరోవైపు దోమల బెడద తట్టుకోలేక రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు.
దవాఖానలో లీకవుతున్న డ్రైనేజీని కట్టడి చేయండని రోగులు మొరపెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సమస్య కంటి ముందు కనిపిస్తున్నా.. దవాఖాన సూపరింటెండెంట్, అధికారులు మరమ్మతులపై దృష్టి సారించడం లేదు. ఈ మురుగును చూసే రోగులు గాంధీలో వైద్యమంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఆరోగ్యశాఖ మంత్రి పెద్దాసుపత్రుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటివరకు పర్యటించిన దాఖలాలు లేవు.