శంషాబాద్ రూరల్: శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపంతో రద్దయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 గంటలుగా విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నామని, తిరుమల దర్శన సమయం దాటిపోతున్నదని ఆవేదన చెందుతున్నారు. విమానం రద్దయిన విషయాన్ని తమకు చివరి నిమిషంలో చెప్పారంటూ మండిపడుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం 47 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానం వెళ్లాల్సి ఉన్నది. అయితే సాంకేతిలోపం తలెత్తడంతో సర్వీసును అధికారులు నిలిపివేశారు. అప్పటికే ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులకు విషయం తెలియడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. విమానం వస్తుందా లేదా అనే విషయమై ఎయిర్ లైన్స్ అధికారుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాకపోవడంతో మరింత ఆలస్యం అవకాశం ఉంది.