TGSRTC | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఒక ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ సర్కార్ మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో బస్సుల కొరతతో గ్రేటర్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా బస్సులు లేకపోవడం, సమయానికి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకంతో గ్రేటర్లో ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితుల్లో బస్సుల సంఖ్య పెంచకపోవడం ఇప్పుడు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. వచ్చే అరకొర బస్సుల్లోనే ప్రయాణికులు కిక్కిరిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
కాగా, తక్షణ అవసరం దృష్ట్యా 200 బస్సులను గ్రేటర్‌కు అందించాలని గ్రేటర్ అధికారులు.. ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. కాగా ఇప్పటికే విద్యార్థులు, ప్రయాణికులు లక్ష సంతకాల ఉద్యమం చేసి బస్సుల సంఖ్య పెంచాలని అధికారులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్తగా 200 బస్సులు కావాలని అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికైనా నూతన బస్సులు వచ్చే సూచనలు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గ్రేటర్లో ఉచిత బస్సు పథకం అమలుకు ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు సుమారు 5 లక్షల దాకా ఉండేవాళ్లు. అయితే మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక బస్సుల్లో ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. అయితే ఇంతమంది ప్రయాణభారం గ్రేటర్లో ఉన్న 2,600 బస్సులపైనే ఆధారపడి ఉంది. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఈ క్రమంలో బస్సుల సంఖ్యను పెంచాల్సిందే అంటూ ప్రజలనుంచి నిత్యం ఆర్టీసీ అధికారులకు వినతులు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో కండక్టర్లకు టికెట్లు జారీ చేయడం, ఆధార్ నంబర్లను సేకరించడం అనేది కత్తిమీద సాములాంటిదే. ఇదే క్రమంలో నగరంలో బస్సు నడపాలంటే ఎంతో ఓపిక ఉండాలి. నిత్యం రోడ్లపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రతీ నాలు గు, ఆరు నిమిషాలకు ఓ స్టాప్ వస్తూనే ఉంటుంది. రద్దీ రోడ్లపై ఇలా ప్రతీ స్టాపు వద్ద ఆపుకుంటూ మళ్లీ డ్రైవ్ చేస్తూ గమ్య స్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. కొన్ని రూట్లల్లో రోడ్లు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంటాయి.
మరికొన్ని రూట్లలో రోడ్లు చిన్నగా ఉంటా యి. వీటన్నింటి మధ్య డ్రైవర్ బస్సు నడుపుతూ ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. బస్సుల సంఖ్య పెంచితే ఇటు ప్రయాణికులకు అటు ఆర్టీసీ సిబ్బందికి క్షేమదాయకంగా ఉండనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 ఎలక్ట్రిక్ బస్సుల్లో సికింద్రాబాద్ రీజియన్‌కు 400 బస్సులు కేటాయించారు. అందులో 111 ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా 289 బస్సు లు రావాల్సి ఉన్నవని అధికారులు తెలిపారు.