హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను (School Fees) నియంత్రించాల్సిన ప్రభుత్వం చోధ్యం చూస్తున్నది. ఫీజుల నియంత్రణకు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఏటా ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు పెంచుకుంటూ పోతున్నాయి. దీంతో పిల్లల చదువులు తల్లిదండ్రులకు రానురాను భారంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) ఉన్న జీ హై స్కూల్ యాజమాన్యం వచ్చే విద్యా సంవత్సరానికిగాను ఫీజులను భారీగా పెంచింది. ఒకేసారి 30 శాతం ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్-విజయవాడ పాత రోడ్డుపై భైఠాయించారు.
యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ఒకేసారి 25 నుంచి 30 శాతం ఫీజులు పెంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 10 శాతమే పెంచుతామని యాజమాన్యం తమకు చెప్పిందని, ఇప్పుడు ఒకేసారి 30 శాతం ఫీజులు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఇప్పటికే యాజమాన్యానికి మెమోరాండం సమర్పించామని, అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పారు. ఇలా పెంచుకుంటూ పోతే ఎలా భరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డుపై ధర్నా చేస్తుండటంతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.