తెలంగాణ యవనికపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మరో భగీరథ ప్రయత్నం పూర్తయింది. సమైక్య పాలకుల వివక్షతో కరువు సీమగా మారిన పాలమూరు గడ్డపై దశాబ్దాల జల కల సగర్వంగా సాకారమైంది. సీఎం కేసీఆర్ సంకల్పంతో అనితర సాధ్యమైన అపూర్వ జల దృశ్యం సాక్షాత్కారమైంది. నెర్రెలు బారిన పాలమూరు నేలను తడిపేందుకు బిరబిరమంటూ..కృష్ణమ్మ పైకెగిసి పరవళ్లు తొక్కింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా శనివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. మహాబాహుబలి మోటర్లను స్విచ్ఆన్చేసి నీటిని విడుదల చేశారు. కృష్ణా నదీ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల హారతి పట్టారు.