సిటీబ్యూరో, ఏప్రిల్27(నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడి తర్వాత హైదరాబాద్‌లో పాకిస్థానీయులు ఉండకూడదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు పాకిస్థానీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ నుంచి షార్ట్‌టర్మ్ వీసాపై నగరానికి వచ్చిన పౌరులు నలుగురు ఉన్నారు. వీరిలో ఒకరు శనివారం వెళ్లిపోగా ఆదివారం మరో ముగ్గురు కూడా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వారంతా వేర్వేరుగా విమానంలో దుబాయ్‌కు వెళ్లి నట్లుతెలుస్తోంది. షార్ట్ టర్మ్ వీసా ఉన్నవారు ఆదివారం లోపు వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో షార్ట్ టర్మ్ వీసాపై వచ్చిన వారిలో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు.
వీరిలో ఓ చిన్నారితో వచ్చిన మహిళ, మరో మహిళ ఆదివారం వెళ్లిపోగా పురుషుడు శనివారం శంషాబాద్ నుంచి వెళ్లిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. లాంగ్ టర్మ్ వీసాలున్న 11 మంది విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో వారికి నోటీసులు జారీ చేయలేదని వారు తెలిపారు. ఈ క్రమంలో వివిధ రకాల వీసాలపై నగరంలో ఉన్న 208 మంది విరాలపై ఆరా తీయగా తెరపైకి వచ్చిన మరో అంశం హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ వ్యవహారం కీలకంగా మారింది.
పాకిస్థాన్‌కు చెందిన ఇక్రమ్ విషయంలో ఖైదీలుగా ఉన్నా, కేసులు విచారణలో ఉండి పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ వారిని వెనక్కు పంపడానికి కేంద్రం అనుమతి లేదని పోలీసులు తెలిపారు. సిటీసైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో డిపోర్టేషన్ సెంటర్లో ఇక్రమ్ ఉన్న కారణంగా అతనిని ఇప్పట్లో పాకిస్థాన్‌కు పంపాలా వద్దా అనే విషయంపై క్లారిటీ రావలసి ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.