సిటీబ్యూరో, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): పహల్గాం ఉగ్రదాడి తర్వాత నగరంలో పాకిస్థానీల వివరాల సేకరణలో పోలీసులకు హైదరాబాద్ డిటెన్షన్ సెంటర్లో బందీగా ఉన్న మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్ వ్యవహారం సవాల్‌గా మారింది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఖైదీలుగా ఉన్నా, కేసులు విచారణలో ఉండి పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ వారిని వెనక్కి పంపడానికి కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. సిటీసైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో డిపోర్టేషన్ సెంటర్లో ఇక్రమ్ ఉన్న కారణంగా అతడిని ఇప్పట్లో పాకిస్థాన్‌కు పంపాలా వద్దా అనే విషయంపై క్లారిటీ రావలసి ఉందని సీసీఎస్ పోలీసులు చెప్పారు.
నగరానికి చెందిన మహిళ 17 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఇక్రమ్ పరిచయమయ్యాడు. తాను ఢిల్లీకి చెందిన వ్యక్తినని చెప్పి నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం తర్వాత ఆ మహిళ దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చింది. ఇక్రమ్ కూడా ఆమె తర్వాత భారత్‌కు రావడానికి ప్రయత్నించినా తాను పాకిస్థానీ కావడంతో రాలేకపోయాడు. తర్వాత అక్రమంగా ఇండియాకు చేరుకుని హైదరాబాద్‌కు వచ్చాడు. మొదట్లో ఆమెకు విజిటర్స్ వీసా మీద వచ్చినట్లుగా నమ్మించిన ఇక్రమ్ ఆరునెలల తర్వాత తన బాగోతం బయటపడడంతో ఆమె గొడవ పడి దూరం పెట్టింది.
ఇక్రమ్‌కు, అతడి భార్యకు మధ్య గొడవలు కావడం.. ఆమెను వేధించడంతో అతడి భార్య మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. మళ్లీ ఇక్రమ్ వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018లో ఇక్రమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇక్రమ్ పాకిస్థానీ అని తెలియడంతో పోలీసులు అతడిని డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. సిటీలో ఉన్న సమయంలోనే ఆధార్‌కార్డ్ కూడా తీసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా ఏదైనా కేసులో బెయిల్ ఇచ్చి పంపించే అవకాశం ఉంటుంది కానీ ఇక్రమ్ కేసులో అక్రమ చొరబాటుగా చూపి అతడిని సీసీఎస్ పోలీసులు డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. 2023 నుంచి ఇక్రమ్ డిటెన్షన్ సెంటర్లోనే ఉన్నారు. ఇక్రమ్ విషయంలో అతను అక్రమంగా ఇండియాకు రావడంతో పోలీసులు అతనిని డిపోర్టేషన్‌కు పంపినప్పుడు పత్రాల్లో తప్పులున్నాయంటూ వారు రిజెక్ట్ చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇక్రమ్ వ్యవహారాన్ని కేంద్రహోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు.