హిమాయత్‌నగర్, సెప్టెంబర్ 25: రాష్ట్రంలోని బీసీల విశ్వసనీయత కోల్పోక ముందే బీసీ కులగణన చేసే ప్రక్రియను మొదలు పెట్టాలని లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, సంఘం రాజకీయ విభాగం జాతీయ అధ్యక్షుడు బొల్ల శివశంకర్ అన్నారు.
బీసీ కుల సంఘాల ఐక్యత కోసం ఈ నెల 26న నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం నారాయణగూడలోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి కొన్ని కులాలే రాజ్యమేలుతుండటంతో బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు రాజకీయంగా సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్నారు. చట్ట సభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, బీసీల కులగణన చేయకుండా ప్రభుత్వం సాకులు చెబితే ఊరుకునే ప్రసక్తే లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర అధ్యక్షుడు మురళి, ప్రధాన కార్యదర్శి మాచర్ల రాంచందర్, రాష్ట్ర నేతలు భాస్కర్, కందగట్ల భిక్షపతి, శ్రీనివాస్, గుర్రం శ్రవణ్, నరేందర్, బిళ్ల దీపిక, బొమ్మ ప్రవళిక, రాకేశ్, బొమ్మ అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.