మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 1: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఉపాసభాపతి ఎం. పద్మ దేవేందర్ రెడ్డి (Padma Devender Reddy) విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌ను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ ప్రజా ప్రతినిధులు, శ్రేణులతో కలసి ప్రత్యేక వ్యూహాలతో ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్నారు. శనివారం ఎర్రగడ్డ డివిజన్లోని సుల్తాన్‌నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక ఐరన్ షాపులో మహిళలతో మాట్లాడారు. కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తమకు ఉపాధి కల్పించి రజకులకు ఐరన్ షాపులకు ఫ్రీ కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్ళీ ప్రజలకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. తమ షాపులకు ఫ్రీ కరెంటు కట్ చేసి బిల్లు కొడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.
అనంతరం పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో చేసిన మోసాలను ప్రజలకు గుర్తు చేస్తూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పాలన గురించి తెలియజేసారు. రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, గాలికి వదిలేసిన హామీలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అంది సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజలకు కష్టాలు నెలకొల్పిందని గుర్తు చేశారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు, పెన్షన్ పెంచుతామని మోసం చేశారనీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పొట్ట కొట్టిందని రజక సోదరులకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఐరన్ షాప్‌కు కరెంటు ఫ్రీగా ఇచ్చామని గుర్తు చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గోపినాథ్‌ను గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ప్రచారంలో స్థానిక నాయకులతో పటు మెదక్ నాయకులు అహ్మద్, లింగా రెడ్డి, జుబేర్ అహ్మద్, కుమార్ యాదవ్, రాజ్ కుమార్, నరేష్, రంజిత్, లడ్డు తదితరులు ఉన్నారు.