సిటీబ్యూరో, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ) : 30 లక్షల జనాభా ఉండి, మూడు తరాలుగా మెరుగైన రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు ఆవేదన చెందారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా… జరుగుతున్న జాప్యంతో ఈ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతోందని, మెరుగైన రవాణా సదుపాయాలు లేక, నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. ఆదివారం మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ నుంచి జీడిమెట్ల వరకు పాదయాత్ర నిర్వహించారు.
ఈ ప్రాంతానికి స్థానికులు పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొని “మాకెప్పుడు మెట్రో వస్తుంది” అంటూ ప్రశ్నించారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి అధ్యక్షుడు సంపత్‌రెడ్డి మాట్లాడుతూ… మేడ్చల్ మెట్రో తమ ప్రాంత ఆత్మగౌరవమని, డీపీఆర్ రూపొందించడంతో మెట్రో నిర్మాణం పూర్తి కాదన్నారు. లక్షల మంది జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే మెట్రో సాధన విషయంలో ఈ ప్రాంత వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలన్నారు.