ఉస్మానియా యూనివర్సిటీ: ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేషన్ (BCFS) రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులు యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకాభిప్రాయంతో రాష్ట్రపతికి పంపించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతో కోర్టు వివాదాలకు అవకాశం లేకుండా, న్యాయ సమీక్షకు దూరంగా ఉండేందుకు తొమ్మిదవ షెడ్యూళ్లో చేర్చాలని కోరారు. ఈ డిమాండ్‌తో వచ్చే నెల 1న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా సైదులు యాదవ్ మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగించాలనే బీజేపీ వైఖరిని తప్పుపట్టారు. 1971లో అనంతరామన్ కమిషన్ ఆధ్వర్యంలో ఆరు ముస్లిం ఉపకులాలను చేర్చిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే ఆ పార్టీని బీసీల ద్రోహిగా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బారీ అశోక్, లింగం యాదవ్, రమేశ్, గణేష్, సురేశ్, అభి, శంకర్, పరమేశ్, నవీన్, కార్తీక్, శశి, నరేష్, యాదగిరి, సుమన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.