Osmania University | హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ), ఉస్మానియా యూనివర్సిటీ: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ట నానాటికీ దిగజారుతున్నది. హాస్టల్లో నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళన చేసిన ఘటనను మరువకముందే తాజాగా మంగళవారం రాత్రి న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో వడ్డించిన ఆహారంలో బ్లేడ్ కనిపించడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ఆహారం నాణ్యతపై ఎన్నిసార్లు నిరసనలు చేసినా పరిస్థితిలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఆహారంలో పురుగులు మాత్రమే వచ్చేవని, ఇప్పుడు ఏకంగా రేజర్ బ్లేడ్లు వస్తున్నాయని మండిపడ్డారు.
వర్సిటీ ఉన్నతాధికారులు వివరణ ఇచ్చేవరకు తాము ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. ఆహారంలో బ్లేడ్ రావడంతో కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.11 వేల కోట్లతో ప్రపంచ స్థాయి హైటెక్ సమీకృత గురుకులాలు నిర్మిస్తామని గప్పాలు కొడుతున్నారని, కానీ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో అన్నంలో పురుగులు, బ్లేడ్లు వస్తున్నాయని విమర్శించారు.
ఉస్మానియా విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారని, రాజకీయాలు బంద్ చేయాలని పేర్కొన్నారు. కమీషన్ల కోసం సమీక్షలు, ప్రెస్మీట్లు పెట్టడం మానేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడే విద్యార్థుల చదువు, ఆరోగ్యం గురించి ఆలోచించాలని చురకలంటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.