Operation Rope | బంజారాహిల్స్: ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ప్రధాన రహదారుల్లో రోడ్డు ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సంయుక్తాధ్వర్యంలో గురువారం తొలగించారు. మినిస్టర్స్ క్వార్టర్స్ వెళ్లే రోడ్డుతో పాటు కమాన్ వద్ద, ఎన్బీనగర్ బస్తీకి వెళ్లేదారితో పాటు సితార హోటల్ దాకా రోడ్డుకు ఇరు వైపులా ఆక్రమణల తొలగింపు చేపట్టారు.
వెస్ట్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్‌తో పాటు టౌన్ ప్లానింగ్ శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ దాకా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. మోర్ మెడికల్ హాల్ సమీపంలో ఓ భవన యజమాని రోడ్డుపై ఫుట్‌పాత్‌ను కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తించి..ఆ ఫెన్సింగ్‌ను తొలగించారు.
మొత్తం 75 ఆక్రమణలను తొలగించామని, ఆక్రమణలతో ట్రాఫిక్ సాఫీగా సాగలేకపోతోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఫిర్యాదులు వస్తున్నాయని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. ఆక్రమణలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.