ముంపు కాలనీల గుర్తింపునకు సర్వే
ఓపెన్ డ్రైన్ బాక్స్ ఏర్పాటుకు రూ.64 కోట్ల నిధులు కేటాయింపు
భవిష్యత్‌లో వరద రాకుండా చర్యలు
బడంగ్‌పేట, మార్చి31: ముంపు సమస్యను శాశ్వతం గా పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో కొన్ని సంవత్సరాల నుంచి ముంపు సమస్యతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి సబితారెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు దీంతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రూ. 64 కోట్ల నిధులను మంజూరు చేశారు. దీంతో కార్పొరేషన్ పరిధిలోని ముంపు కాలనీలను గుర్తించి అధికారులు రూట్ మ్యాప్‌ను సిద్ధ్దం చేస్తున్నారు. సమస్యలు లేని చోట పనులు త్వరగా మొదులు పెట్టాలని అధికారులు బావిస్తున్నారు. అందుకు సంబంధించిన సర్వే పనులు మొద లు పెట్టారు. లిబ్రా ఇన్క్లెవ్, సుమా ప్యారడైజ్, మారుతి నగర్ నుంచి నాలా ప్రారంభమై బడంగ్‌పేట వెంకటేశ్వర స్వామి ఆలయం పక్క నుంచి శివనారాయణ పురం, వరలక్ష్మీనగర్, నవయుగ కాలనీ, మీదగా మీర్‌పేట పెద్ద చెరువులోకి వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించారు. జీహెచ్ఎంసీ స్టాటర్టిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం విభాగం నాలాలను అభివృద్ధి చేయబోతున్నారు. బాక్స్ డ్రైన్ ఒకటిన్నర మీటర్ లోతు, రెండున్నర మీటర్ల వెడ ల్పు ఉండే విధంగా ప్లాన్ చేశారు. బాక్స్ డ్రైన్ పనులు పూర్తి అయితే భవిష్యత్‌లో ముంపు సమస్య రాదని అధికారులు పేర్కొంటున్నారు.
వరద వచ్చే కాలనీ ప్రాంతాలు
ముంపు కాలనీలో భారీ వర్షాలు వస్తే ఎగువ కాలనీలు దేవతాల గుట్ట, గాంధీనగర్, నాదర్గుల్, పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వరద బడంగ్‌పేటలోని కాలనీలను ముంచేస్తుంది.ప్రధానంగా సుమా ఫార్యడైజ్, లిబ్రా ఇన్క్లెవ్, రామిడి చంద్రారెడ్డి కాలనీ, వెంకటాద్రీ నివాస్, వెంకటేశ్వర కాలనీ, సాయి టౌన్ షీప్, సాయి రాంకాలనీ, సాయి ప్రభు హోమ్స్, సీతాహోమ్స్, వరలక్ష్మీనగర్, నవయుగ కాలనీ, తదితర కాలనీలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. వరద ప్రవాహంతో ఇండ్లలోకి నీరు రావడంతో పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు.
వానకాలంలోపు పనులు పూర్తి చేయిస్తాం
వానకాలంలోపు నాలాల పను లు పూర్తి చేయిస్తాం. సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బాక్స్ డ్రైన్ ఏర్పాటు కోసం సర్వే చేయిస్తు న్నాం. ఇంజినీరింగ్ అధికారులు నాలాల నిర్మాణంపై దృష్టి పెట్టారు. కొన్ని చోట్ల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. పాలకవర్గ సభ్యులతో మరోసారి సమన్వయం చేసుకొని పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సబితారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. -కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి