మేడ్చల్, సెప్టెంబర్ 20(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ఒక్క ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశమే జరిగింది. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే 1,775 ఇండ్లను మంజూరు చేశారు. మిగతా మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు నాలుగు నియోజకవర్గాల్లో ఇందిరమ్మ పథకం అమలుకు నోచుకోలేదు.
మేడ్చల్ నియోజకవర్గంలో మంజూరైన 1,775 ఇండ్లలో 560 ఇండ్లు బెస్మెట్ వరకు రాగా, 286 ఇండ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయి. 106 ఇండ్లు మాత్రం ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున 17,500 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. అయితే జిల్లాలో మాత్రం 1,775 ఇండ్లను మాత్రమే మంజూరు చేశారు. ఇందిరమ్మ ఇంటి పథకానికి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 3 లక్షల 20వేల దరఖాస్తులు వచ్చాయి. మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఇంకా దరఖాస్తుల పరిశీలనే ప్రారంభం కాలేదు.