సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ ) : ‘జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరిగింది. ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండడం కోసమే చేపట్టాం. ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుంది. వికేంద్రీకరణ జరిగి ప్రజలకు మెరుగైన పాలన అందించవచ్చు..కార్పొరేటర్లు ప్రజల క్షేత్ర సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారు. వార్డుల పరిమాణం, విస్తీర్ణం తగ్గడం వల్ల ప్రజలు తమ ప్రతినిధులతో నేరుగా సంప్రదించే అవకాశం పెరుగుతుంది’..ఇదీ డీలిమిటేషన్‌పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటన..ఈ ప్రకటన వెలువడిన
కొద్ది సేపటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అరికపూడిగాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేటర్లను వెంటబెట్టుకుని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి ఉదయమే వచ్చి వార్డుల పునర్విభజనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
డివిజన్ల పునర్విభజనపై మేయర్, కమిషనర్లను వేర్వేరుగా కలిసి చర్చించారు. డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతిపత్రం అందజేశారు. ఏ ప్రతిపాదన డివిజన్ల పునర్విభజన చేశారో చెప్పాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. వార్డుల విభజన గందరగోళంగా ఉందని, కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే విభజన చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. మా అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. వార్డుల విభజన ఏ ప్యారామీటర్ ఆధారంగా చేశారో తెలియడం లేదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.17వ తేదీ లోపు అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇస్తామని, సీఎం దృష్టికి కూడా ఈ సమస్యలను తీసుకువెళ్తామని తెలిపారు.
జనాభా ఆధారంగా డివిజన్లను విభజించామని అధికారులు చెబుతున్నారని, ఎలాంటి పారామీటర్స్ తీసుకున్నారో మాత్రం చెప్పడం లేదన్నారు. కొన్ని డివిజన్లలో ఎక్కువ ఓట్లు, మరికొన్ని డివిజన్లలో తక్కువ ఓట్లు ఉన్నట్లు గుర్తించామని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పేర్కొన్నారు. కౌన్సిల్లో అభ్యంతరాలపై డీటెయిల్‌గా చర్చిస్తామన్నారు. వార్డుల మోడిఫికేషన్ చేయడానికి ఏం అవకాశం ఉందో గుర్తించాలని చెప్పామని, సరిహద్దులు తెలియకుండా అధికారులు వాటికి ఫిక్స్ చేసినట్లు గుర్తించి కమిషనర్‌కు చెప్పినట్లు గాంధీ స్పష్టం చేశారు. అయితే గడిచిన ఆరు రోజులుగా ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు చెప్పని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చివరి నిమిషంలో మొక్కుబడిగా అభ్యంతరాలున్నాయంటూ చెప్పడం గమనార్హం.
వార్డుల విభజనపై ఒకే పార్టీ నుంచి రెండు వేర్వేరు వాదనలు వినిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఆరితేరిన కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ డివిజన్ పునర్విభజన అంశంలోనూ అదే పద్ధతిని అవలంబిస్తున్నది. ఈ నెల 13న ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన నగర కార్పొరేటర్లు, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం జరిగినట్లు అరోపణలు వస్తున్నాయి.
ఈ సమావేశంలోనూ వార్డుల పునర్విభజనపై అన్ని అంశాలను ముందుగానే మ్యాపులతో సహ వారికి వివరించినట్లు చర్చ జరుగుతుండడం, మంగళవారం కౌన్సిల్ సందర్భంగా విపక్షాలు అధికార పార్టీ కుట్రలు ఎక్కడ భయటపెడతారోనన్న గ్రహించి ముందుగానే నామమాత్రంగా మాకు అభ్యంతరాలున్నాయంటూ కమిషనర్, మేయర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారన్న వాదనలు లేకపోలేదు. కౌన్సిల్ వేదికగా బీఆర్ఎస్ను ఎదుర్కొనలేక అటెక్షన్ డైవర్షన్‌కు పాల్పడుతున్నట్లు చర్చ జరుగుతున్నది. మొత్తంగా రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్దిని పూర్తిగా విస్మరించిన రేవంత్ సర్కారు..విస్తరణ పేరుతో హైదరాబాద్‌లో పట్టున్న బీఆర్ఎస్ను మరింత దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం, వార్డుల డీలిమిటేషన్ పై మంగళవారం (నేడు)జరగనున్న కౌన్సిల్లో బలంగా గళం విన్పించేందుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు సిద్దమయ్యారు.. వార్డుల పునర్విభజనపై జీహెచ్ఎంసీ అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తుండగా, ఇప్పటికే పలువురు మేయర్‌ను కలిసి పునర్విభజన అశాస్త్రీయంగా, ఒక వర్గానికి రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చేలా జరుగుతుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కమిషనర్, మేయర్‌ను కలిసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇష్టమొచ్చినట్లు చేసిన వార్డుల విభజనపై నిలదీస్తామని విపక్షాలు చెప్పిన దరిమిలా నేడు జరిగే కౌన్సిల్ సమావేశం సర్వత్రా ఆసక్తి నెలకొంది.