Indiramma Indlu |మేడ్చల్, మే16(నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇంటి పథకంలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండో విడతలో 967 ఇండ్లను మాత్రమే మంజూరు చేయడంతో దరఖాస్తుదారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి విడతలో 308 ఇం డ్లను మంజూరు చేసిన విషయం విదితమే. రెండో విడతలో అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేస్తారని భావించిన దరఖాస్తుదారులకు నిరాశే ఎదురైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులను స్వీకరించి 16 నెలలు గడిచిన పథకాన్ని అమలు చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండ్ల మంజూరుకు సంబంధించి జాబితా జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే మంజూరు చేసిన ఇండ్లలో అర్హులు ఎంత మంది ఉన్నారో అన్న అనుమానాలు దరఖాస్తుదారులను వేధిస్తుంది.
సర్వే పేరిట కాలయాపన..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఇందిరమ్మ పథకానికి లక్షా 42 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొదటి, రెండో విడత కలిపి 1,275 మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయి. మళ్లీ దరఖాస్తుల సర్వే పేరిట మరింత కాలం కాలయాపన చేసే అవకాశం ఉందని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సర్వే జరిగింది కానీ మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి నియోజకవర్గాల్లో ఇంకా సర్వేను ప్రారంభించనే లేదు.