సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగాణ ) : నగరంలో సర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే మందకొడిగా సాగుతుండటంపై ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారంతో ఫారాల పంపిణీ గడువు ముగిసినప్పటికీ, జిల్లా వ్యాప్తంగా కనీసం 50 శాతం కూడా పంపిణీ పూర్తి కాలేదు. నిబంధనల ప్రకారం శుక్రవారం నుంచి నింపిన ఎన్యూమరేషన్ ఫారాలను బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) సేకరించాల్సి ఉంది. నగరంలో ఈ ప్రక్రియ ఇంత నిదానంగా సాగడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎలాంటి సర్వేల్లోనూ పాల్గొనని కొత్త సిబ్బందిని ఈ సారి సర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులుగా నియమించారు. దీనికి తోడు నగరంలో ఓటర్లు ఇళ్లలో అందుబాటులో ఉండకపోవడం మరో పెద్ద శాపంగా మారింది. అధికారులు మాత్రం పంపిణీ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన వేగవంతం చేస్తామని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్వో) స్పష్టం చేస్తున్నారు.
నగరంలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందించడం లేదని ఓటర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. చాలాచోట్ల బీఎల్వోలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా, స్థానిక లీడర్ల ఇండ్ల వద్ద, రాజకీయ పార్టీల కార్యాలయాల్లో లేదా కమ్యూనిటీ హాళ్లలోనే కూర్చొని ఫారాల పంపిణీ కానిచ్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సాధారణ ఓటర్లు స్వయంగా అకడికి వెళ్లి ఫారాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లా పరిధిలో మొత్తం 47,36,669 మంది ఓటర్లు, 4,062 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. కొన్ని బూత్‌లలో 90 శాతం వరకు ఫారాలు పంపిణీ పూర్తి కాగా.. మరికొన్ని చోట్ల కనీసం 30 నుంచి 40 శాతం కూడా దాటలేదు. ముఖ్యంగా యాకత్పురా, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు ఫారాలు ఆలస్యంగా సరఫరా కావడంతో అకడ ప్రక్రియ దారుణంగా వెనుకబడింది. ఓల్డ్‌సిటీ (పాతబస్తీ) లాంటి ప్రాంతాల్లో అసలైన ఓటర్లను గుర్తించడం బీఎల్వోలకు పెద్ద సవాల్ గా మారింది. ఇకడ అంతా లీడర్ల ఆధిపత్యంలోనే ఫారాలు పంపిణీ సాగుతుండటం గమనార్హం.

ఇండ్లు మారిన కుటుంబాలు, ఉద్యోగ రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లిన వారికి ఎన్యూమరేషన్ ఫారాలు అందడం లేదు. కుటుంబ సభ్యులు కాకుండా ఇతరులకు ఫామ్స్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. చాలామంది పాత చిరునామాల్లో అందుబాటులో లేకపోవడంతో పంపిణీ సాధ్యం కావడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా అపార్ట్ మెంట్లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పైగా ఒకసారి వెళ్లిన ఇండ్లకు బీఎల్వోలు తిరిగి వెళ్లడం లేదని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ప్రతి ఇంటికీ బీఎల్వోలు వెళ్లేలా, నింపిన ఫారాలను నేరుగా సేకరించేలా చర్యలు తీసుకోకపోతే.. అర్హులైన వేలాది మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఎస్ఐఆర్లో భాగంగా కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారి నుంచి ‘ఫామ్- 6’తో పాటు డిక్లరేషన్ ను బీఎల్వోలు సేకరించాల్సి ఉంది. కానీ జిల్లాలో కొన్ని ప్రాంతాలు మినహా ఎకడా కొత్త ఓటర్ల దరఖాస్తులను స్వీకరించడం లేదు. ఇప్పుడు కేవలం ఎస్ఐఆర్ ఫామ్స్ మాత్రమే సేకరిస్తాం.. ఫామ్- 6ను రెండు నెలల తర్వాత తీసుకుంటాం’ అంటూ బీఎల్వోలు సమాధానం ఇస్తుండటంతో కొత్త ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత స్లోగా సాగుతుండటాన్ని గమనించిన జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వయంగా రంగంలోకి దిగారు. రెండ్రోజులుగా కంటోన్మెంట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జోనల్ కమిషనర్లు అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి పర్యవేక్షించాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. బీఎల్వోలు కూడా ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేయడంతో.. అధికారులు అప్రమత్తమై చాలా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచే ఫారాలు పంపిణీని ముమ్మరం చేశారు.
సర్ ప్రక్రియను మొక్కబడిగానే చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది కొరత, అవగాహన లోపంతో ప్రక్రియ పారదర్శకంగా సాగడం లేదు. అయితే సర్‌లో భాగంగా బీఎల్ఓలకు పోలింగ్ స్టేషన్ల వారీగా విధులు కేటాయించారు. 12 వందల మంది ఓటర్లకు ఒక బీఎల్ఓ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బీఎల్ఓ ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అందజేయాలి. దీంతో ఇంటిలోని వారు పత్రాలు పూరించి, బీఎల్ఓలకు అందజేస్తారు. ఈ ప్రక్రియకు కటాప్ తేదీని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు అనుకున్న లక్ష్యం చేరలేదు. పత్రాల పంపిణీలో ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరికి చేరేలా మూడు సార్లు అధికారులు ఇంటిని సందర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి పత్రాలు అందజేయకపోయిన, పత్రాలు నింపి ఇవ్వాలని ఓటర్లకు అవగాహనలేకపోయిన, నిర్లక్ష్యం చేసిన ఓటును కోల్పోయే ప్రమాదం ఉంది. అధికారుల నిర్లక్ష్యం ఓటుపై వేటుకు అస్కారం ఏర్పడుతుంది.