ముషీరాబాద్, ఆగస్టు 20: అకాల వర్షంతో వచ్చిన వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాంనగర్లో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంతానికి చెందిన బి.విజయ్ కుమార్(43)కు తల్లిదండ్రులు, భార్యాపిల్లలు లేక పోవడంతో తాగుడుకు బానిసయ్యాడు.
రోజు మాదిరిగానే సోమవారం రాత్రి కూడా ఇంటి ముందున్న అరుగుపై నిద్రపోయాడు. మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో వచ్చిన వరదను నిద్ర మత్తులో ఉన్న అతడు గమనించలేదు. అతడు నిద్రమత్తులో నుంచి తేరుకునేలోపే వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొద్ది దూరం నీటిలో కొట్టుపోయిన అతడు కార్లు అడ్డుతగలడంతో ఆగిపోయాడు.
అప్పటికే అతడు మృతి చెందాడు. మృతదేహం కార్ల మధ్య చిక్కుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు మృతదేహాన్ని నీటి నుంచి తీసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహినుద్దిన్, బీఆర్ఎస్ నేత ముఠా జయసింహ సందర్శించారు.