హైదరాబాద్: రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుల ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి రథయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో (Electric Shock) ఐదుగురు అక్కడికక్కడే మృతించెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్న గణేశ్ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. మిగిలిన ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఘటనా స్థలంలోనే కృష్ణయాదవ్ (21), సురేశ్ యాదవ్(34), శ్రీకాంత్‌రెడ్డి (35), రుద్రవికాస్ (39), రాజేంద్రరెడ్డి (45) మరణించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గన్‌మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
రామంతాపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు, వారికి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన విద్యుత్ శాఖ సీఎండీని బాధితులు, స్థానికులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ప్రమాదంలో చనిపోయిన ఆరు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ప్రతి కుటుంబానికి రూ.కోటి చొప్పున నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.