CV Anand | సిటీబ్యూరో: గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తయిందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ఉదయం 10.30 గంటల వరకు ట్రాఫిక్ జంక్షన్లు అన్ని క్లియర్ చేసినట్లు చెప్పారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రణాళిక ప్రకారం నిమజ్జనం పూర్తి చేశామన్నారు. నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ మైదానాల్లో విగ్రహాలతో ఉన్న లారీలను పార్కింగ్ చేయించి.. సాధారణ పౌరులకు రూట్ క్లియర్ చేసినట్లు కమిషనర్ చెప్పారు.
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం అనుకున్న సమయానికే పూర్తయిందన్నారు. నిమజ్జన ఘట్టంలో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి సీపీ సీవీ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు. కొన్ని వాహనాలు బ్రేక్ డౌన్ కావడం వల్ల నిమజ్జనాలు కొంత ఆలస్యమయ్యాయని, లేదంటే ఉదయం 7 గంటల వరకు అంతా పూర్తయ్యేదని సీపీ చెప్పారు. 11 రోజుల్లో కేవలం హుస్సేన్‌సాగర్‌లోనే లక్ష విగ్రహాలు నిమజ్జనమైనట్లు వెల్లడించారు.