సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : ఓల్డ్ సిటీ మెట్రో మరింత జాప్యం కానున్నది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది, భూసేకరణ పనులు మొదలుపెట్టి 8 నెలలుగా గడుస్తున్నా… ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెబుతున్నా.. భూసేకరణ ప్రక్రియ మాత్రం పూర్తి కాలేదు. హైదరాబాద్ మెట్రోకు కొత్త ఎండీ వచ్చినా.. కార్యాచరణకు వచ్చేసరికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఇక మతపరమైన నిర్మాణాలు, ఆస్తుల సేకరణలో భూతగాదాలు కోర్టుల పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వం కూడా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకపోవడంతో ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు మరింత జాప్యం కానున్నది.
7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న ఓల్డ్ సిటీ మెట్రోకు భూసేకరణ జాప్యంతో నిర్మాణ పనులకు మరో మూడు నెలలు సమయం పట్టేలా ఉంది. ఓల్డ్ సిటీ అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టును నిర్మిస్తామని కాంగ్రెస్ సర్కారు చెబుతున్నా.. మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. మొత్తం 800 పైగా ఆస్తులను గుర్తించగా, ఇందులో 400 ఆస్తులను సేకరించారు. మిగిలిన ఉన్న ఆస్తుల విషయంలోనే భూ తగదాలు చుట్టుకుంటున్నాయి. వేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగా ఆచరణలో కనిపించడం
ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టులో భూ వివాదాలు ప్రధాన సమస్యగా మారాయి. వందలాది మంది తమ ఆస్తులను కాపాడుకునేందుకు భూ యజమానులు కోర్టులను ఆశ్రయించారు. చారిత్రక నిర్మాణాలు, మతపరమైన కట్టడాలు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పినా… క్షేత్రస్థాయిలో భూసేకరణకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. దీంతోనే మార్చి నుంచి ఏప్రిల్లోగా ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ పూర్తి చేసి, కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉంది. గతేడాది సెప్టెంబర్ నాటికి ఆస్తులను తీసుకోవాలనే లక్ష్యం ఉంది. కానీ భూసేకరణ ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా సాగకపోవడంతో, ఆస్తులు ఇచ్చిన ప్రాంతంలోనే కూల్చివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కోర్టు పరిధిలో ఉన్న భూ వివాదాలు ముగిసేంత వరకు ప్రాజెక్టు పనులు కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.