సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ) : పాతనగరం మెట్రో కోసం భూసేకరణ నత్తనడకన సాగుతున్నది. జనవరి మొదటి వారంలోనే కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉన్నా.. భూములు ఇచ్చేందుకు జనాలు ముందుకు రాకపోవడంతో ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికీ 40మందికే మాత్రమే భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించగా.. మిగిలిన వందలాది భూ యజమానులతో ఇప్పటికీ సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హెచ్ఏఎంఎల్ ప్రక్రియ మరికొంత జాప్యం జరుగుతున్నది. మెట్రో ఫేజ్-2 విధివిధానాలను వెల్లడించిన క్రమంలో జనవరి నెలలో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.
కానీ ఇప్పటికీ సేకరణ ప్రక్రియ సాగుతుండటంతో… కూల్చివేతలు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. రెండో దశ మెట్రో నిర్మాణంలో కీలకమైన ఎంబీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మార్గంలో ఇప్పటివరకు 34 ఆస్తులను సేకరించి 40మందికి రూ. 20 కోట్ల పరిహారాన్ని చెల్లించారు. ఈ ప్రాజెక్టు కోసం వెయ్యికి పైగా ఆస్తులు ప్రభావిత జాబితాలో ఉన్నాయి. దీనికి పరిహారం సుమారు వెయ్యి కోట్లు పై మాటే ఉండగా భూసేకరణ ప్రక్రియలో వేగం పుంజుకోలేదు. ఏడున్నర కిలోమీటర్ల మేర నిర్మించే ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట మెట్రో విస్తరణలో ఆస్తుల సేకరణయే కీలకంగా మారిన నేపథ్యంలో అప్పటివరకు కూల్చివేతలను ప్రారంభించే అవకాశం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పుడు మొదలుపెడతారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
భూసేకరణ పూర్తి చేస్తే కూల్చివేతలు..
ఏడున్నర కిలోమీటర్ల మేర నిర్మించే ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణను రూ. 2741 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు. ఫేజ్-2 విస్తరణలో భాగంగా దాదాపు 1000కిపైగా ఆస్తులు ప్రభావితం అవుతున్నట్లుగా గుర్తించారు. ఇందులో ఇప్పటికే 40మంది భూ యజమానులు మెట్రోకు అంగీకారం తెలపడంతో… భూ యజమాన్య హక్కుల పరిశీలన తర్వాత 40మందికి చెక్కులను పంపిణీ చేశారు. మిగిలిన వారు కూడా త్వరగా ముందుకు వస్తే భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు మొదలవుతాయి. అయితే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశామని, త్వరలోనే కూల్చివేతలు పూర్తి స్థాయిలో మొదలవుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. కానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని భూములిచ్చేందుకు యజమానులు విముఖత వ్యక్తం చేయడంతోనే భూసేకరణ ప్రక్రియలో జాప్యం జరుగుతుందని సమాచారం.