Oldcity Metro | సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఒక అడుగు ముందుకు… రెండు అడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది పాత బస్తీ మెట్రో పరిస్థితి. మెట్రో రెండో దశ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందిస్తున్నది. 7 మార్గాల్లో 70 కి.మీల మేర నిర్మించే రూట్లలో పాతబస్తీకి చెందిన 5.5 కి.మీ మార్గం సైతం ఉంది. అయితే మెట్రో మొదటి దశలో ప్రతిపాదించిన మొత్తం 72 కి.మీ మార్గానికి సంబంధించిన డీపీఆర్‌ను 2010-2011లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించింది.
నిర్మాణ అనుమతులు సైతం ఉన్నాయి. మళ్లీ కొత్తగా పాతబస్తీకి సంబంధించిన ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు ఉన్న 5.5 కి.మీ మార్గానికి డీపీఆర్ అవసరం లేకపోయినా, దాన్ని సైతం రెండో దశలో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి డీపీఆర్ పూర్తయి, నిర్మాణ అనుమతులు సైతం వచ్చిన మెట్రో మార్గానికి మళ్లీ డీపీఆర్ అవసరం లేదు. ఎల్ అండ్ టీతో ఉన్న ఒప్పందంలో భాగంగా దాన్ని వెంటనే నిర్మాణం చేపట్టేందుకు అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా కారిడార్-2 (జేబీఎస్-ఫలక్‌నుమా) మార్గంలో 5.5 కి.మీ మార్గాన్ని స్పష్టంగా ఖరారు చేశారు. ఈ రూట్లో 5 స్టేషన్లను సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, షంషీర్గంజ్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో నిర్మించాలని సూత్రపాయంగా నిర్ణయించారు.
పాతబస్తీకి మెట్రో అన్నది ఎన్నో ఏండ్లుగా ఉన్న డిమాండు. మాకు మెట్రో కావాలంటూ పాతబస్తీ వాసులు పదే పదే కోరినా.. వాయిదాలు పడుతోందే తప్ప..అడుగు ముందుకు పడటం లేదు. రెండో దశ మెట్రోతో సంబంధం లేకుండా పాతబస్తీ మెట్రో మార్గాన్ని 5.5 కి.మీ మేర నిర్మించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే వెంటనే ప్రారంభించేందుకు అవకాశం ఉంది. అయినా ఆ విషయాన్ని పట్టించుకోకుండా రెండో దశలో చేర్చి కొత్తగా డీపీఆర్‌ను రూపొందిస్తున్నామని చెప్పడం పట్ల పాతబస్తీ వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
పాతబస్తీలో నిర్మించే మెట్రో మార్గంలో మొత్తం 103 కట్టడాలు మతపరమైన, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని అధికారులు చెప్పారు. మొత్తం మార్గంలో 4 చోట్ల తప్ప మిగిలిన అన్ని మతపరమైన, సున్నితమైన నిర్మాణాలను పరిరక్షిస్తూ మెట్రో మార్గం నిర్మాణం ఉంటుందన్నారు. ఈ మార్గంలో రోడ్డు వెడల్పు 80 అడుగులకు పరిమితం చేసి విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. విస్తరణలో ప్రభావితమయ్యే సుమారు 1000 ఆస్తుల వ్యక్తిగత స్కెచ్‌ల తయారీ ప్రారంభించామని, ఒక నెల రోజుల్లో భూ సేకరణ నోటీసులు జారీ చేస్తామని మెట్రో అధికారులు గతంలోనే ప్రకటించారు. అయినా వీటన్నింటినీ పక్కన పెట్టి..మళ్లీ ఈ మార్గాన్ని రెండో దశ మెట్రో ప్రాజెక్టులో చేర్చడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.