దుండిగల్, మార్చి 2: వారాంతపు సెలవులు కబ్జాదారులకు వరంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో శనివారం నిర్మాణాలు మొదలుపెట్టి ఆదివారం వరకు పూర్తి చేసి, రాత్రికి రాత్రే రంగులు వేసి అందులో మనుషులను దింపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ తతంతగం కొనసాగుతోంది. ఈ నిర్మాణాలను ఫొటోలు, వీడియోలు ఎవరైనా తీస్తే అక్రమార్కులు వారిపై దాడులకు దిగ్గుతున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదు.
వివరాల్లోకి వెళ్తే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గండి మైసమ్మ.. దుండిగల్ మండలం, బౌరంపేటలోని ఇందిరమ్మ కాలనీ పక్కనున్న ప్రభుత్వ జాగా సర్వేనెంబర్ 576లో 15 ఏండ్ల క్రితం పేదలకు ఇందిరమ్మ పట్టాలను పంపిణీ చేసింది. దీనిని అడ్డుపెట్టుకుని కొందరు వ్యక్తులు సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాలను సృష్టించి వాటి ఆధారంగా సర్వే నెంబర్ 578,580లో నోటరీ చేసి ప్రభుత్వ భూమి ఫ్లాట్లుగా చేసి విక్రయాలు చేపడుతున్నారు.
రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకోవడం, శని,ఆదివారాల్లో గదుల నిర్మాణం పూర్తి చేసి అనంతరం వాటిని రూ.15-20 లక్షలకు విక్రయించి సొమ్ము చేసు కుంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు సంబంధించి ఆరు నెలల్లోగా ఇండ్లు నిర్మించుకోకపోతే ఆటోమేటిక్ గా పట్టా రద్దు అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం అవే పట్టాలకు నకిలీ పట్టాలు సృష్టించి ఏళ్ల తరబడి చలామణిలోకి తెస్తూ కొందరు భూకబ్జాదారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. బౌరంపేట ఇందిరమ్మ ఇండ్ల సమీపంలోని ప్రభుత్వ భూమిలో గత రెండు, మూడు రోజులుగా కొందరు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతుండగా ఫొటోలు తీశాడనే నేపంతో ఓ వ్యక్తిని చితకబాధినట్లు తెలుస్తుంది.