Ali Cheruvu | ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5 : గతం లో అనుమతులిచ్చిన అధికారులే.. ఇప్పుడు అక్రమ నిర్మాణాలంటూ మా ర్కింగ్ చేస్తున్నారని హైడ్రా కూల్చివేతల్లో ఇండ్లు కోల్పోతున్న బాధితులు పేర్కొంటున్నారు. చెరువులు, కుంటలు కబ్జాకు గురైనప్పుడు కండ్లు మూసుకొని..తీరా సామాన్యు డు కొన్న తర్వాత నిబంధనలు వల్లించడం అధికారులకు పరిపాటిగా మారింది.
ఇందుకు నిదర్శనమే ఆగపల్లి సమీపంలోని అలీచెరువు పరిధిలో విల్లాల నిర్మాణం. ఎలాంటి అనుమతుల్లేకుండా చెరువులో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కేసులు నమో దు చేసి ఆరు నెలలైనా చర్యలు తీసుకోకపోవడంతో సామాన్యులు అందులోని విల్లాలు కొని నష్టపోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అలీచెరువులో యథేచ్ఛగా నిర్మాణాలు..
మొన్నటి వరకు హైడ్రా పరిధి అవుటర్ రింగు రోడ్డు వరకేనన్న ప్రచారం ఉండేది. కానీ, కొన్ని రోజుల కిందట ఇబ్రహీంపట్నం చెరువును హైడ్రా అధికారులు పరిశీలించడం ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పరిధి తమ మ్యాపులోనే ఉన్నదని హైడ్రా కమిషన ర్ రంగనాథ్ చెప్పడంతో ఈ ప్రాంతంలోని చెరువులు, కుం టల్లోని అక్రమ నిర్మాణాలపై చర్చ మొదలైంది. గతంలో నిర్మించిన వాటి విషయం దేవుడెరుగు..ప్రస్తుతం జరుగుతున్న అక్రమ నిర్మాణాలనూ అధికారులు అడ్డుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలీచెరువు 25 ఎకరాల మేర విస్తరించి ఉండగా.. అందులో 10-15 ఎకరాల వరకు కబ్జాకు గురైనట్లు గూగుల్ మ్యాపు ద్వారా తెలుస్తున్నది. దాని బఫర్జోన్తోపాటు ఎఫ్టీఎల్ పరిధిలో సిరి నేచర్స్ వ్యాలీ రిసార్ట్స్ వారు యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీనిపై గత ఏప్రిల్లోనే నీటి పారుదల శా ఖ ఇంజినీర్లు ఠాణాలో కేసు నమోదు చేసినా ఫలితం లేదు.
నిర్మాణాలు మాత్రం కొనసాగుతున్నాయి. రెరా జాబితాలో నూ అక్కడ అనుమతులు పొందినట్లు లేదు. ప్రభుత్వ స్థ లంలో వెలిసిన నిర్మాణాలను సామాన్యులు కొని తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. హెచ్ఎండీఏ వెబ్సైట్లోని చెరువు మ్యాపును పరిశీలిస్తే చెరువు సగానికి పైగా కబ్జాకు గురైనట్లు కనిపించడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.