Medchal | మేడ్చల్, నవంబర్15 (నమస్తే తెలంగాణ): సమగ్ర కుటుంబ సర్వేపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. సర్వే దేశానికే దిక్సూచి, సామాజిక న్యాయం అంటూ ఆర్భాటంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి దాటిన తర్వాత మేడ్చల్-నిజామాబాద్ వెళ్లే దారిలో రేకులబావి చౌరస్తా నుంచి భారత్ పెట్రోల్‌బంక్ వరకు 44 జాతీయ రహదారి పొడువునా గురువారం సాయంత్రం సర్వే ఫారాలు రోడ్డుపై కనిపించాయి. దీంతో సర్వేపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. ఇప్పటికే సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్లకు తమ కుటుంబ వివరాలు అందించకుండా ప్రజలు తిప్పి పంపిన ఘటనలు నగరంలో అనేకం జరిగాయి. అయితే పూరించని సర్వే ఫారాలను ఎక్కడికి తీసుకెళ్తుండగా రోడ్డుపై పడిపోయి ఉంటాయని అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. సర్వే ఫారాలు రోడ్డుపై పడిన తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్ద పడుతున్నదని ప్రజలు వాపోతున్నారు. సర్వేలో తమ కుటుంబ వివరాలు ఇవ్వాలా వద్ద అన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు.
సర్వేపై ప్రజల్లో అభద్రత భావం..
సమగ్ర కుటుంబ సర్వేనా లేక ఫేక్ సర్వేనా అంటూ ప్రజలు త్రీవంగా విమర్శిస్తున్నారు. సర్వేలో తమ ఆస్తులు, విలువైన తమ కుటుంబ సభ్యుల వివరాలు ఎందుకని ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తునారు. తమ వ్యక్తిగత ఆస్తుల వివరాలు బహిర్గమైతే మా పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిన విషయం తెలిసిందే. అదే తీరును ఈ సర్వేలో కనబరుస్తుంటే అభద్రతా భావం ఏర్పడుతుందని ప్రజలు పేర్కొనడం గమనార్హం.
విచారణ చేస్తున్న అధికారులు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ రహదారిపై పడి ఉన్న సమగ్ర కుటుంబ సర్వే ఫారాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సర్వే ఫారాలు రోడ్డుపై పడి ఉన్నట్లు జిల్లా కలెక్టరేట్ నుంచి మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి కిలోమీటర్ వరకు పడి ఉన్న వేలాది సంఖ్యలో సర్వే ఫారాలను సేకరించిన విషయం తెలిసిందే. అయితే రోడ్డుపై పడి ఉన్న సర్వే ఫారాలు జిల్లాకు చెందినవా? లేక ఇతర జిల్లాలకు తీసుకెళ్తుంటే… రోడ్డుపై పడిపోయాయా ? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సర్వేపై ప్రజలకు ఉన్న అనుమానాలు ఈ ఘటనతో మరింత బలపడ్డటైంది. సర్వే ఫారాలు రోడ్డుపై పడిపోవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై మేడ్చల్ జిల్లాలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.