సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో ప్రజావాణి కంటితుడుపు చర్యగా మారింది. దూర ప్రాంతాలు నుంచి వచ్చి..ఎంతో ఆశగా అపరిష్కృత సమస్యను మేయర్, కమిషనర్‌కు విన్నవిస్తే పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న అర్జీదారులకు నిరాశే ఎదురవుతున్నది. గడిచిన నాలుగు వారాలుగా ప్రతి సోమవారం నిర్వహించే ఈ విశిష్ట కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొనడం లేదు. మేయర్, కమిషనర్ లేని ప్రజావాణిని ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా ముగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పైగా ప్రజావాణిలో ఒకసారి కాకుంటే మరోసారి వచ్చి ఫిర్యాదు చేసినా.. లాభం ఉండటం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 6 నెలల నుంచి జీతాలు లేక బతకడమే కష్టంగా మారిందని ఈఎస్ఐ ఆసుపత్రి స్వీపర్స్, సెక్యూరిటీ సిబ్బంది అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. తమను నియమించిన ఏజెన్సీలు తమకు జీతాలు ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నాయని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇప్పటికీ నాలుగు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ లేబర్ ఆఫీసర్‌ను కలవాలని చెబుతున్నారని.. అక్కడికి వెళ్లినా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు సాజీదా బేగం, సుజాత, రజినీ, యాదమ్మ మాట్లాడుతూ.. ‘మాకు జనవరి నుంచి ఇప్పటి వరకు జీతం ఇవ్వలేదు. ఆ డబ్బులొస్తేనే మా పిల్లలకు స్కూలు, కాలేజీల ఫీజులు చెల్లించగలం. ఇంటి కిరాయి కట్టుకోగలం. కడుపునిండా అన్నం తినగలం. ఆ జీతం రాక రోజు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అని వాపోయారు.
ప్రధాన కార్యాలయంలో 64 విన్నపాలను అధికారులు స్వీకరించారు. టెలీఫోన్ ద్వారా మరో 8 ఫిర్యాదులను స్వీకరించారు. దరఖాస్తుల్లో 25 టౌన్‌ప్లానింగ్, 10 రెవెన్యూ, ఏడు డీఎంఅండ్‌హెచ్‌వో, ఇంజినీరింగ్ మెయింటనెన్స్ ఐదు, అడ్మిన్ సెక్షన్‌కు సంబంధించినవి నాలుగు, జలమండలివి రెండు విన్నపాలను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. బస్తీ దవాఖాన, ఫుట్‌పాత్ ఆక్రమణ, ఇంటి ముందు విగ్రహం ఏర్పాటు, వీధి కుక్కల సమస్యలపై విన్నవించినట్లు అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. ఇక జోన్లలో 102 ఫిర్యాదులు స్వీకరించగా, కూకట్పల్లి జోన్లో అత్యధికంగా 73 దరఖాస్తులను స్వీకరించారు. శేరిలింగంపల్లిలో 15, చార్మినార్‌లో 5, ఎల్బీనగర్ 3, ఖైరతాబాద్ జోన్లో ఒకటి మాత్రమే విన్నపాలు వచ్చాయి.
నగరాభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించడమే కాదు.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత మేయర్‌ది. అయితే అటు తోటి కార్పొరేటర్లకు కానీ, ఇటు ప్రజలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి దూరంగా ఉంటూ వస్తున్నరన్న విమర్శలున్నాయి. పైగా బల్దియా ప్రధాన కార్యాలయానికి మొక్కుబడిగా వస్తున్నారు. సీఎస్ఆర్ నిధుల సమీకరణ, సిస్టర్ సిటీ ఒప్పందాలపై సమీక్షలు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అన్నింటి కంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ఘటనాస్థలికి వెళ్లడం లేదు. శానిటేషన్‌పై ఆకస్మిక పర్యటనలు లేవు..
అప్పుల కుప్పలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీని గట్టెక్కించే ప్రయత్నాలు కానీ…నగరాభివృద్ధికి మేయర్ చేసిందేమీలేదన్న విమర్శలు లేకపోలేదు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టి..మూడేండ్లు గడిచినా.. పాలనలో తన మార్కును చూపలేకపోతున్నారు. కార్పొరేషన్‌పై పట్టు సాధించలేకపోతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. నగరంలో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్న దాఖలా ఒక్కటీ లేదని ప్రతిపక్ష పార్టీలైనా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. కేవలం అధికారులపై ఆధారపడటం వల్లే.. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపలేకపోతున్నారని అంటున్నారు. మేయర్ మాట్లాడే విధానంలోనూ విమర్శలు లేకపోలేదు.