Hyderabad | మియాపూర్, మార్చి 30: లక్షల్లో ఆస్తి పన్ను బకాయి ఉన్న ఒక వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు వైవిధ్యమైన చర్యలకు దిగారు. ఆస్తి పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ యజమాని స్పందించకపోవడంతో సదరు వాణిజ్య సముదాయం ఎదుట పెద్ద గుంత తవ్వారు.
శనివారం మధ్యాహ్నం వాణిజ్య సముదాయంలో బట్టల వ్యాపారం కొనసాగుతుండగా ఆకస్మికంగా జేసీబీతో పాటు మందిమార్బలంతో వచ్చిన పన్ను విభాగం అధికారులు దుకాణం ఎదుట బయటకు ఉన్న షెడ్డును తొలగించారు. అనంతరం దుకాణం ఎదుట రెండు అడుగుల మేర పెద్ద గుంతను తవ్వారు. దుకాణంలోకి కస్టమర్లు ఎవరూ వెళ్లకుండా, వ్యాపారం జరగకుండా ఉండేలా ఈ విధంగా చర్యలకు దిగారు.
గుంత తవ్వే సమయంలో దుకాణదారుడు పన్నువిభాగం అధికారులను బతిమిలాడుకున్నాడు. యజమానితో సంప్రదింపులు జరుపుతామని, చర్యలకు దిగొద్దని రిక్వెస్ట్ చేశాడు. అయినప్పటికీ అధికారులు వినిపించుకోకుండా గుంత తవ్వి వెశళ్లిపోయారు. ఉగాది పండుగ కావడంతో వస్త్రాల కొనుగోలు కోసం పెద్ద సంఖ్యలో కస్టమర్లు వస్తుండటంతో ఇదే సరైన సమయమని భావించి ఇలా గుంత తవ్వి వెళ్లారని దుకాణదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ చర్యతో ఉలిక్కిపడిన యజమాని.. వెంటనే అధికారులను కలిసి పన్ను చెల్లించినట్లు తెలిసింది. దీంతో అధికారులు తీసిన గుంతను దుకాణదారుడు ఆదివారం పూడ్చివేశాడు.
ఇదే చందా నగర్ సర్కిల్లోని మాదాపూర్ పరిధిలోని ఓ వాణిజ్య భవనం రూ.20 లక్షలకు పైగా పన్ను బకాయి ఉండటంతో అధికారులు తాళం వేసి సీజ్ చేశారు. కానీ ఇందుకు భిన్నంగా పన్ను బకాయి ఉన్న దుకాణం ఎదుట భారీ గుంతను తవ్వడం ఇప్పుడు జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.