హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ హోటల్లో దారుణం చోటుచేసుకున్నది. ఓ నర్సింగ్ విద్యార్థిని (Nursing Student) అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఆమెపై హత్యాచారం చేసి ఆత్మహత్యగా చిత్రిస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. గచ్చిబౌలిలోని రెడ్స్టోన్ హోటల్ రూమ్లో ఓ యువతి ఉరివేసుకున్న స్థితిలో చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతిగా గుర్తించారు.
అయితే గదిలో అంతా రక్తపు మరకలు, మందు బాటిళ్లు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గది మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో గొడవ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా, మృతురాలి బంధువులు హోటల్ వద్ద ఆందోళనకు దిగారు. శృతి మృతదేహాన్ని అంబులెన్సులో తీసుకెళ్తుండగా అడ్డుకున్నారు. తమ బిడ్డపై లైంగికదాడి చేసి, అనంతరం ఉరి వేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.