అబిడ్స్, డిసెంబర్ 2: జనవరి మాసం వచ్చిందంటే వెంటనే గుర్తుకు వచ్చేది అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్). 2023 జనవరి ఒకటవ తేదీ నుంచి నుమాయిష్‌ను ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే స్టాల్ల కేటాయింపు, నూతన స్టాల్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విని మార్గం మాట్లాడుతూ..జనవరి ఒకటో తేదీ నుమాయిష్ ప్రారంభం నాటికి 80 శాతం స్టాల్లు ఏర్పాటయ్యేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సారి నుమాయిష్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ప్రవేశ రుసుం 40 రూపాయలు..
జనవరి ఒకటవ తేదీన ప్రారంభం కానున్న నుమాయిష్‌కు ప్రవేశ రుసుమును 40 రూపాయలుగా పెంచుతూ జనరల్ బాడీలో తీర్మానించారు. గత సంవత్సరం ప్రవేశ రుసుము 30 రూపాయలుండగా ఈ సంవత్సరం 40 రూపాయలుగా నిర్ణయించారు. ప్రతి సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు నుమాయిష్‌ను నిర్వహించనున్నారు.