సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఏడుగురిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన పల్లెపు వెంకటేశ్, గుండాల శ్రావణ్, శ్రీరాం, కరీంనగర్‌కు చెందిన మెట్టపల్లి రామకృష్ణ, సిద్దిపేటకు చెందిన చల్లారపు రాజిరెడ్డి, సరూర్‌నగర్‌కు చెందిన రఘుగౌడ్, మంచిర్యాలకు చెందిన కె.హరీశ్ యాదవ్‌తోపాటు మరికొంత మంది కలిసి తరచూ విమానాల్లో గోవా వెళ్లి, అక్కడ ఖరీదైన మద్యం కొనుగోలు చేసి నగరానికి తరలిస్తున్నారు.
ఆబ్కారీ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి మద్యం తరలించడం నేరం. అయితే, నిందితులు గోవాలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన మద్యాన్ని నగరానికి తరలించి.. ఎక్కువ ధరలకు విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గోవా నుంచి శంషాబాద్‌కు వచ్చే విమానాలపై నిఘా పెట్టారు. బుధవారం గోవా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే విమానాల్లో పెద్ద ఎత్తున నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న అధికారులు.. పక్కా ప్రణాళికతో ఎయిర్ పోర్ట్ అధికారుల సహాయం తీసుకుని రాత్రి 10 గంటల నుంచి గురువారం తెల్లవారుజాము 3 గంటల వరకు మూడు విమానాల్లో అక్రమంగా మద్యం తీసుకొచ్చిన ఏడుగురిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
వారి వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును శంషాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించారు. ఆబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి, డీసీ పి.దశరథ్ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ జీవన్ కిరణ్ ఆధ్వర్యంలో జరిపిన ఈ దాడుల్లో ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ సుభాష్, చందర్రావు, చంద్రశేఖర్, డీటీఎఫ్ సీఐ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
చంఢీగర్ నుంచి నగరానికి అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని ముషీరాబాద్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.3.85లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌కు చెందిన గోపాల్ అగర్వాల్ చంఢీగర్‌లో తక్కువ ధరకు మద్యం కొనుగోలు చేసి, నగరానికి తరలిస్తాడు. అనంతరం ఆ మద్యాన్ని రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇందులో భాగంగానే చంఢీగర్‌లో రూ.1.32 లక్షలతో వివిధ రకాల బ్రాండ్లకు చెందిన 72 మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి, ఒక వాహనంలో నగరానికి తరలించాడు. గురువారం మధ్యాహ్నం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న నిందితుడు.. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యాన్ని మరో వాహనంలోకి మారుస్తున్నట్టు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ తన బృందంతో కలిసి గోపాల్ అగర్వాల్ వాహనాన్ని తనిఖీ చేశాడు. అందులో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి రూ.3.85లక్షల విలువ చేసే 72 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.