సిటీబ్యూరో/ కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 29 (నమస్తే తెలంగాణ ) : మూసాపేట సర్కిల్ కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్‌లో అనుమతి లేని బిల్డింగ్‌ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. భవనాలను సీజ్ చేస్తూ… బ్యానర్ కట్టడంతో పాటు ఎక్స్ ఆకారంలో ఎల్లో రిబ్బన్లను కట్టారు. కానీ… కొద్ది రోజులు పనులు ఆపిన భవన నిర్మాణదారులు… మళ్లీ సీజ్ చేసిన భవనాల్లో పనులను సాగిస్తున్నారు. కొందరు ఏకంగా సీజ్‌ను తొలగించి.. నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులను, సరిల్ కమిషనర్‌ను వివరణ అడిగితే… సీజ్ తొలగించి పనులు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని, మరోసారి సీజ్ చేసిన భవనాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న 31 భవనాలను సీజ్ చేయడం, ఆ సీజ్‌ను తొలగించిన 15 మంది భవన యజమానులపై స్థానిక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదైనా నిర్మాణ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఒక్క మూసాపేట సర్కిలే కాదు.. చాలా సర్కిళ్లలో ఇదే తంతు కొనసాగుతున్నది. కొన్ని చోట్ల అక్రమార్కులకు కొందరు చైన్మెన్లు, ఏసీపీలు సహకరిస్తుండగా, మరికొన్ని చోట్ల సీజ్ చేసిన భవనంలో బరితెగించి మరీ లోపల పనులు జరుపుతున్నారు. కొన్ని చోట్ల నిర్మాణ పనులు జరుపుతున్నప్పుడే అమ్మకాలు జరుపుతూ అమాయకులకు ఆక్రమార్కులు టోకరా వేస్తుండడం గమనార్హం.
అక్రమ నిర్మాణామని తేలితే చాలు ముందుగా పనులు జరగనీవ్వకుండా ఆ భవనాన్ని సీజ్ చేయాలని హైకోర్టు జీహెచ్ఎంసీని ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిషనర్ ఆర్ వీ కర్ణన్ జోనల్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట కూల్చివేత ఉత్తర్వు (స్పీకింగ్ ఆర్డర్)కు ముందు లేదా ఆ ఉత్తర్వు ఇచ్చాక ఆమోదం పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా జరిగే నిర్మాణాలను అనుమతి లేని భవనాలను జీహెచ్ఎంసీ చట్టం -1955లోని సెక్షన్ 461-ఏ కింద జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ , డిప్యూటీ కమిషనర్ సీజ్ చేయనున్నారు.
ఒకసారి సీల్ వేసిన భవనాన్ని తెరిచే అధికారం కొందరికే ఉంటుంది.. డిప్యూటీ కమిషనర్ సీజ్ చేసిన భవనాన్ని జోనల్ కమిషనర్ , జోనల్ కమిషనర్ సీజ్ చేసిన భవనాన్ని కమిషనర్ మాత్రమే తొలగించాల్సి ఉంటుంది. కానీ సీజ్ చేసిన భవనాలపై సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో న్యాయస్థానాల ఆదేశాలు బేఖాతరు చేస్తుండడం, క్షేత్రస్థాయిలో ఉండే చైన్మెన్ల ప్రోత్సాహంతో ఎక్కువ శాతం అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 178లో పొందుపరిచిన మార్గనిర్దేశిక సూత్రాలను జోనల్ కమిషనర్లు బేఖాతరు చేస్తున్నారని, టీజీ బీపాస్ చట్టంలోని 3(2)లోని నియమావళి ప్రకారంగా జోనల్ పరిధిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలకు జోనల్ కమిషనర్ నేతృత్వం వహించడం, జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాల్సి ఉంది. టీజీ బీపాస్ చట్టం-2020లోని సెక్షన్ 28(1) ద్వారా సంక్రమించిన అధికారాలు, నియమాలు జీవో నం. 200లోని సూత్రాలను అనుసరిస్తూ జోనల్ పరిధిలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలను, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేస్తూ 3-3-2020న ఆరు జోన్లకు 6 మంది నోడల్ అధికారులు 24 మందితో 12 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను, సర్కిళ్లలోని వార్డుల ప్రకారంగా 84 మంది న్యాక్ ఇంజినీర్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ టీంలు అక్రమ కట్టడాల కూల్చివేత, జరిమానాలు, సీజ్ చేయడం, పంచానామా వంటివి నిర్వర్తించాలని ఆ ఉత్తర్వులో స్పష్టం చేసింది. కానీ ఎస్టీఎఫ్ల లక్ష్యాలు పక్కదారి పట్టాయి. అవినీతి అలవాటుగా పడిన కొందరు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. అక్రమార్జనకు లక్ష్యంగా అనధికారిక నిర్మాణాలను పెంచిపోషిస్తుండడంలో పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనిపై గత కమిషనర్ ఇలంబర్తి దృష్టి సారించి 27 మంది న్యాక్ ఇంజినీర్లపై వేటు వేశారు.
కొత్తగా వారి స్థానంలో డిప్యూటేషన్‌పై తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో వెలుస్తున్నాయో, అవినీతి ఎంత జరుగుతుందో న్యాక్ ఇంజినీర్ల ఉదంతమే నిదర్శనం. ఇక చైన్మెన్లను మాటల్లో చెప్పలేనక్కర్లేదు. క్షేత్రస్థాయిలో చైన్‌మెన్ అండతోనే అంతా వ్యవహారం జరుగుతున్నది. ముఖ్యంగా ఉదాసీనంగా రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహరిస్తుండడం, ఓసీలు లేకుండా విద్యుత్ శాఖ కనెక్షన్లు ఇస్తుండడం, జలమండలి నల్లా కనెక్షన్లు అడ్డదారిలో ఇస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.