కందుకూరు, జూన్ 11 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు స్పందన కరవైంది. ఏ సదస్సులో చూసినా రైతులు కానీ.. ప్రజలు కానీ కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిని తొలగించింది. ఆ స్థానంలో భూభారతిని ప్రవేశపెట్టింది. భూభారతిలో ఉన్న చట్టాలను రైతులకు ఉపయోగపడే విధంగా గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఈనెల మూడో తేదీన రెవెన్యూ సదస్సు ప్రారంభించారు. ప్రతిరోజు రెండు రెవెన్యూ గ్రామాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. మండలంలో రెండు బృందాలుగా విభజించి తహసీల్దార్ గోపాల్, నాయబ్ తహాసీల్దార్ శేఖర్ ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులు 21వ తేదీ వరకు కొనసాగుతాయి .
మొదటిరోజు దెబ్బడగూడ, బాచుపల్లి, గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటివరకు మండలంలో దెబ్బడగూడ, బాచుపల్లి పెరుగుగూడ, పులిమామిడి, దన్నారం, చిప్పలపల్లి, మురళి నగర్, జైత్వారం కాల్స, మహమ్మద్ నగర్, అన్నోజిగూడ, తిమ్మాయిపల్లి, పంజాగూడ, మీర్ ఖాన్ పేట్, గుమ్మడవెల్లిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సభలకు రైతుల స్పందన నామమాత్రంగా ఉంది. సభలకు రావడానికి రైతులు ఆసక్తిని చూపలేదు. కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ సభల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారు. వారికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేదికలపైనే ఉంటున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్లు, తాజా మాజీ ఎంపీటీసీలను మాత్రం వేదికలపైకి ఆహ్వానించడం లేదు. ఈ క్రమంలో ఈ సభలకు రైతులు కూడా కేవలం ఒకరిద్దరు మాత్రమే పాల్గొని వినతి పత్రాలను అందజేస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడ కూడా తమ సమస్యలు పరిష్కారం కాలేదని రైతులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా సదస్సులను నిర్వహించి సమయం ముగిసిన తర్వాత వెళ్లిపోతున్నారని చెబుతున్నారు.