వెంగళరావునగర్, జూన్ 29 : పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఆదివారం వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్య రావు ఆధ్వర్యంలో సిద్ధార్థనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన దివంగత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాగంటి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి వెళ్లారని..ఆయన ఆశయాలను సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. నిరుపేదల కోసం నిత్యం పని చేసిన కృషీవలుడు మాగంటి అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మిని అందించారని..పేద రోగుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందించేవారని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుడిలాగా నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయారన్నారు.
ప్రతి పండుగకు అందరికీ తన సొంత డబ్బు వెచ్చించి బహుమతులు పంచిపెట్టారని ప్రజలు తనకు చెప్పారని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉండటంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలిగారని అన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు రానుండటంతో కాంగ్రెస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని..ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ జెండానే ఇక్కడ ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ నాయకులు పందికొక్కుల్లా ప్రజల సొమ్ము తింటున్నారని విమర్శించారు.
నా భర్తలాగే ప్రజల కోసం పనిచేస్తా..: సునీత
ప్రజలకు ఏం ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత పేర్కొన్నారు. తన భర్త గోపినాథ్ ఎలాగైతే ప్రజల కోసం అండగా నిలిచారో తాను కూడా అలాగే ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోవారి సంక్షేమం, ప్రగతి కోసం తపించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి..
మాగంటి సంతాపసభకు ఇంతమంది మహిళలు తరలివచ్చారంటేనే ఆయన మీద మహిళలకు ఎంత అభిమానముందో తెలుస్తుందని జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా మాగంటి కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. ఈ ఎన్నికలు మాగంటి గోపినాథ్‌కు అంకితమని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల కోసం మాగంటి పదకొండున్నర సంవత్సరాల సమయమిచ్చారని..కుటుంబ సభ్యులకు కూడా అంత సమయం ఇవ్వలేదని అన్నారు.
మాగంటి ప్రజల మధ్యే ఉన్నారని..రాజకీయపరంగా బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అభివృద్ధిపరంగా నియోజకవర్గాన్ని ఆయన ఆదర్శంగా నిలిపిన విధానం బాగుందని అన్నారు. గత కొన్నాళ్లుగా బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడ్తున్నారని..రాబోయే రోజుల్లో అక్రమ నిర్బంధాలు ఉంటాయని..ప్రజలకు పార్టీ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.
అంతకు ముందు మాగంటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి.. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడు వత్సల్య నాథ్, కుమార్తెలు అక్షర నాగ, దిషిరా, బీఆర్ఎస్ నాయకులు వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసీఉల్లాహా, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్, డివిజన్ నాయకులు, కాలనీ, బస్తీ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.