Basti Dawakhana | మైలార్దేవ్పల్లి, మార్చి 21 : కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రోగులు కూడా అంతంత మాత్రంగానే వచ్చి నామమాత్రం సేవలు పొందుతున్నారు. వారంలో ఒక రోజు మాత్రమే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బస్తీ దవాఖానాల్లో వైద్య పరీక్షలు చేసేందుకు సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల్లోకి వెళ్లి పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బస్తీ దవాఖానాలకు ప్రతి రోజు 60-70 మంది రోగులు వచ్చి వైద్య సేవలు పొందుతుంటారు. వారికి వైద్య పరీక్షలు చేయడంతో పాటు పరీక్షించి మందులను అందిస్తారు. ఈ ప్రక్రియను పూర్తిగా రిజిస్టార్లో నమోదు చేస్తారు. అనంతరం 3 గంటలలోపు ఈ ప్రక్రియను ఆన్లైన్ డెటాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ సరైన డాటా ఎంట్రీ సిబ్బంది, సరిపడా నర్సులు మాత్రం కానరావడం లేదు. దీంతో ఉన్న ఒకరిద్దరు సిబ్బందితోనే ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడంతో పనా భారం అధికమవుతుందని ఒత్తిడికి లోనవుతున్నారు. డాటా ఎంట్రీ సిబ్బంది, ఎక్కువ నర్సులను నియమిస్తే ఉన్న సిబ్బందికి భారం తగ్గనుంది.
బస్తీ దవాఖానాలకు వచ్చే రోజులకు మందులు సరిగ్గా అందుబాటులో ఉండడం లేదు. ఒక ప్రాథమిక ఆరోగ్యం 2-3 బస్తీ దవాఖానాల నిర్వహణను చూస్తుంది. నెలకు సరిపడా మందులు ఒకేసారి ఇస్తుంటారు. బస్తీ దావాఖానాలకు వచ్చే రోగుల సంఖ్యకు పీహెచ్సీ అందించే మందులకు పొంతనలేకుండాపోతుంది. ప్రభుత్వం అందజేస్తున్న మందులు కేవలం 15 రోజులకు మాత్రమే సరిపోతున్నాయని మిగతా రోజుల్లో స్థానికంగా ఉన్న పీహెచ్సీలకు వెళ్లి తీసుకోవాల్సిందిగా సిబ్బంది చూసిస్తున్నారు. దీంతో పలుమార్లు రోగుల సహాయకులకు, బస్తీ దవాఖానా సిబ్బందికి పలుమార్లు వాగ్వివాదం చోటు చేసుకుంటున్నాయి. రోగులకు సరిపడా మందులు లేన్నప్పుడు బస్తీ దవాఖానాలను ఎందుకు నిర్వహిస్తున్నారని ఘర్షణలకు దిగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.
బస్తీ దవాఖానాల్లో రోగులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని అత్తాపూర్ డివిజన్ పాండురంగానగర్లోని బస్తీ దవాఖానా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ శ్రీ తెలిపారు. ప్రతి రోజు 70-80 మంది రోగులు వైద్య సేవలు పొందేందుకు వస్తారన్నారు. వారికి సరైన మందులు అందించడంతో పాటు సూచనలు, సలహాలు ఇస్తున్నామన్నారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా మందులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో మందుల కొరత సమస్య పెరుగుతుంది. బస్తీ దవాఖానాలో ఒక మెడికల్ ఆఫీసర్ డాక్టర్తో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు ఉంటారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ పని చేస్తున్న ఒక స్టాఫ్ నర్సును కొత్తగా అత్తాపూర్లో ఏర్పాటు చేసిన యూపీహెచ్సీలో సేవలు అందించేందుకు ఉపయోగిస్తున్నారన్నారు. దీంతో ఇక్కడ పని భారం అధికంగా అవుతుందన్నారు. సిబ్బంది కోరత కారణంగా డాటా ఎంట్రీ, నమోదు ప్రక్రియ ఇలా సమస్యలు ఉత్పన్నం అవుతున్నారన్నారు. ఒక డాటా ఎంట్రీ సిబ్బంది, స్టాఫ్ నర్సులను పెంచితే రోగులకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది.