Hayatnagar | హయత్‌నగర్, ఫిబ్రవరి 11 : హయత్‌నగర్ మండల కార్యాలయం ఆవరణలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (ప్రభుత్వాస్పత్రి) గర్భిణులకు, రోగులకు నరకయాతనగా మారింది. హయత్‌నగర్‌లోని చుట్టుపక్కల కాలనీల ప్రజలు, అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఆయా గ్రామాల పేద, మధ్య తరగతి ప్రజలు ఇక్కడి సీహెచ్‌సీకి చికిత్స నిమిత్తం వస్తుంటారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనికి హయత్‌నగర్ సీహెచ్‌సీ వస్తుంది. హయత్‌నగర్ మాత్రం ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. దాంతో హయత్‌నగర్ సీహెచ్‌సీ రెండింటికీ చెడ్డ రేవడిలాగా తయారైంది. ఆస్పత్రి మాత్రం హయత్‌నగర్‌లో ఉండగా అధికారికంగా సేవలు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కేంద్రంగా అందుతున్నాయి. హయత్‌నగర్ సీహెచ్‌సీపై స్థానిక ప్రజాప్రతినిధులు సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
హయత్‌నగర్‌లో విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా సాగుతుండడంతో గత కొంత కాలంగా యూటర్న్ల సమస్య స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. దాంతో ఆయా కాలనీల ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హయత్‌నగర్ సీహెచ్‌సీలో చికిత్స నిమిత్తం వెళ్లాలంటే నరకయాతనకు గురవుతున్నారు. హయత్‌నగర్ హైవే బావర్చి, శ్రీరాఘవేంద్ర హోటల్ వద్ద, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ వద్ద యూటర్న్ తీసుకోని హయత్‌నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి రావాల్సి వస్తుంది. లేకపోతే ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన మినీ గ్రిల్స్ నుండి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. దీంతో గర్భిణులు, వృద్ధులు, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రిళ్లు మండల కార్యాలయం మద్యం బాబులకు అడ్డాగా మారడంతో ఆస్పత్రిలోకి గుర్తుతెలియని వ్యక్తులు, మద్యం తాగేవాళ్లు వస్తారేమోనన్న బాలింతలు, రోగులు భయాందోళనకు గురవుతున్నారు.
హయత్‌నగర్ సీహెచ్‌సీకి ప్రత్యేకంగా ప్రహారీని నిర్మించి మెయిన్ గేటును ఏర్పాటు చేస్తే 108 అంబులెన్స్, గర్భిణులు, రోగులను తీసుకొచ్చే వాహనాలకు సులభతరం అవుతుంది. మద్యం రాయుళ్ల ఆగడాలు, గుర్తుతెలియని వ్యక్తుల కదలికలు లేకుండా ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రికి ప్రత్యేకంగా ప్రహారీని నిర్మించాలని పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హయత్‌నగర్ మండల కార్యాలయంలోని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు నానా అవస్థలకు గురవుతున్నారు. ప్రతి రోజూ హయత్‌నగర్ మండల కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ఫిర్యాదుదారులు, వైద్య చికిత్స నిమిత్తం వచ్చే గర్భిణులు, వృద్ధులు, రోగులు పడరాని పాట్లు పడుతున్నారు. మండల కార్యాలయానికి కుంట్లూరు రోడ్డులో ఉన్న మెయిన్ గేటును మూసి ఉంచడంతో వారందరూ ఎక్కడి నుండి లోపలికి వెళ్లాలో తెలియక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాన గేట్ల వద్దనే మినీ వ్యాన్లు, ఇతర ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మెయిన్ గేటు వద్ద యథేచ్ఛగా మినీ వ్యాన్లను పార్కింగ్ చేసి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు స్థానికంగా వెలువడుతున్నాయి. జాతీయ, రాష్ట్రీయ స్థాయి నేతల జయంతి, వర్ధంతుల కార్యక్రమాలకు స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం హయత్‌నగర్ సీహెచ్‌సీలో గర్భిణులు, బాలింతలకు, రోగులకు పండ్లు, బ్రెడ్డు ప్యాకెట్లు పంచి చేతులు దులుపుకుంటున్నారే తప్ప వారి సమస్యలను పట్టించుకున్న పాపానపోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం స్పందించి హయత్‌నగర్ సీహెచ్‌సీ వద్ద సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.