Hyderabad | ఎర్రగడ్డ, ఏప్రిల్ 20 : వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల ట్రిప్పులు.. వేల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు.. కానీ అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క బస్ షెల్టర్ అయినా కనిపించదు. ఉన్న ఒక్క షెల్టర్ రెండు నెలల క్రితం హోటల్‌గా మారింది. దీంతో ప్రయాణికులు ఎండా వానలను భరిస్తూ బస్సుల కోసం వేచి ఉండే పరిస్థితి. ఇది బోరబండ బస్ టెర్మినల్ పరిస్థితి.
బస్ షెల్టర్ హోటల్‌గా మారి రెండు నెలలు అవుతున్నా అటు బల్దియా, ఇటు ఆర్టీసీ పట్టించుకోని దుస్థితి. కాంగ్రెస్ నాయకులుగా చలామణి అవుతున్న డివిజన్‌కు చెందిన కొందరు రెండు నెలల క్రితం రాత్రికి రాత్రి బస్ షెల్టర్‌ను కాస్తా హోటల్‌గా మార్చేసే విషయంలో తెర వెనుక నుంచి కథ నడిపించినట్లు సమాచారం. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెల్టర్ కాస్త హోటల్‌గా మారటం స్థానికంగా చర్చనీయాంశమైంది. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగి షెల్టర్‌ను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. అదే విధంగా టెర్మినల్‌లో ఇతర ఆక్రమణలను తొలగించి మరో రెండు బస్ షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నారు.