హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలకు రూపకల్పన చేశారని చెప్పారు. శుక్రవారం ఆయన రజకులు, నాయీబ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన, జీవన ప్రమాణాల పెంపుకోసం ప్రతిపాదించిన దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు తుది విధివిధానాలపై బీసీ కమిషనరేట్‌లో చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యుత్తు సంస్థల సీఎండీ రఘుమారెడ్డి, ఆయా కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పరితపిస్తారని పేర్కొన్నారు.
అపోహలు వీడండి
కులసంఘాల్లో నెలకొన్న అపోహలు, భయాల్ని మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు బుర్రా వెంకటేశం తొలగించారు. ప్రభుత్వమే రజకులు, నాయీబ్రాహ్మణులు లాండ్రీలు, దోబీఘాట్లు, సెలూన్ల తరపున విద్యుత్తు సంస్థలకు 3 నెలల అడ్వాన్స్ చెల్లిస్తుందని చెప్పారు. ట్రేడ్ లైసెన్సులు, లీజు అగ్రిమెంట్ల విషయంలో కులవృత్తిదారులు ఎవరిచుట్టూ తిరగాల్సిన అవసరంలేదని, ఆన్లైన్లో సమర్పించిన స్వీయ ద్రువీకరణతో అధికారులే వివిధశాఖలతో సమన్వయం చేసుకొని కావాల్సిన పత్రాలను సమకూర్చుకొంటారని అభయమిచ్చారు. కులవృత్తిని నిర్వహించే రజక, నాయీబ్రాహ్మణులు యజమానులుగా ఉన్నవారికి మాత్రమే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం వర్తింపజేస్తామని గంగుల స్పష్టంచేశారు. ఇప్పటికే ప్రత్యేక మీటర్లు ఉన్నవాటికి కొత్త మీటర్లు అవసరం లేదని, ప్రత్యేక మీటర్లు లేకపోతే కొత్త మీటర్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని చెప్పారు. ఇప్పటివరకు 200 మంది రజకులు, 400 మంది నాయీబ్రాహ్మణులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తుల స్వీకరణ పద్ధతిని సరళీకరించిన నేపథ్యంలో అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇప్పుడు దరఖాస్తు చేసుకొన్నా పథకాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శి బుర్రావెంకటేశం ప్రకటించారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. ఈనెల 17లోపు రజక, నాయీబ్రాహ్మణ సంఘాలు ఏకసంఘంగా ప్రతిపాదనలు సమర్పించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తిదారులకు అందిస్తున్న చేయూతను ప్రతి ఒకరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.