NMC | దుండిగల్, ఫిబ్రవరి 14: నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ప్రతినిధుల బృందం శుక్రవారం ప్రైవేట్ క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రెండు, దుండిగల్ మున్సిపల్ పరిధి మల్లంపేటలోని నాలుగు క్లినికల్పై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ప్రాక్టీస్ పేరుతో ఎలాంటి అర్హతలు లేకుండానే వైద్యశాలలు నిర్వహిస్తూ రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నట్లు గుర్తించారు. ఎంబీబీఎస్ వంటి డిగ్రీలు లేకుండానే అల్లోపతి వైద్యం నిర్వహిస్తూ.. రోగులకు విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, వ్యాక్సిన్స్, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నట్లు గుర్తించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, బాచుపల్లిలో బుచ్చిబాబు క్లినిక్ పేరుతో అరుణ కుమారి అనే నకిలీ వైద్యురాలు ఏకంగా మహిళలకు అబార్షన్లు చేస్తున్నట్లు గుర్తించారు.
ఆమె కనీసం టెన్త్ క్లాస్ కూడా పాస్ కాలేదని కౌన్సిల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇలాంటివారు అందించే వైద్యంతో రోగులు మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నకిలీ వైద్యుల గుర్తింపులో భాగంగా తరచూ ఇలాంటి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 400పైగా నకిలీ వైద్యులను గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోనే ఇప్పటివరకు 150పైగా కేసులు నమోదయ్యాయని అన్నారు.
ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ పేరుతో ఎలాంటి అర్హతలు లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తున్న వారితో పాటు, ఆయుర్వేద ఇతర వైద్యాశాలలో పేరుతోను అల్లోపతి వైద్యం అందించడం నేరమన్నారు. కనీసం పదో తరగతి, ఇంటర్ కూడా ఉత్తీర్ణులు కానీ వారు అందించే వైద్యంతో ప్రజలకు హాని జరుగుతుంది తప్ప.. ఎలాంటి మేలు జరుగదన్నారు. వీరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, బాచుపల్లిలోని బుచ్చిబాబు క్లినిక్, నిజాంపేట్‌లోని యష్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మల్లంపేటలోని శ్వేతా క్లినిక్, సహజ హాస్పిటల్, జేజే ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌తో పాటు ఆరు క్లినిక్‌ల్లో తనిఖీలు నిర్వహించామని డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. తనిఖీల్లో ఆయనతో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (తెలంగాణ) సభ్యులు డాక్టర్ ఇమ్రాన్, డాక్టర్ విష్ణు పాల్గొన్నారు.