సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి : గత పదేళ్లలో ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గులాబీ పార్టీ బలగం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తోడైన అదనపు బలం.. వెరసి మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటు నుంచి నియోజకవర్గ ప్రజలు గులాబీ జెండానే ఆదరిస్తూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా సరే.. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. దీంతో తాజా ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసి హ్యాట్రిక్ సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి నియోజకవర్గం ఆది నుంచి బీఆర్ఎస్కు అండగా ఉన్నది.
2014లో నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చింతల కనకారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2018లో మైనంపల్లి హన్మంతరావు గెలుపొందారు. అయితే అభ్యర్థి ఎవరనేది కాకుండా ఇక్కడ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది ప్రతి ఎన్నికల్లోనూ రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో గత పదేండ్లలో హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ భారీ ఎత్తున అభివృద్ధి జరిగింది. అర్హులైన నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలూ అందాయి. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ ఎత్తున చేరికలు జరిగాయి. స్థానికుడు, మూడున్నర దశాబ్దాలుగా మల్కాజిగిరి నియోజకవర్గ రాజకీయాల్లోనే అనుభవం ఉన్న డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ప్రగతిభవన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనతో పాటు ఆ పార్టీకి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ముఖ్యంగా నిద్రాహారాలు మాని బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నందికంటి శ్రీధర్ బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం విశేషం.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు వీరే..
టీపీసీసీ సెక్రెటరీ, ఎక్స్‌ఫ్లోర్ లీడర్ దొలి రమేశ్, 140 డివిజన్ ప్రెసిడెంట్ వి.శ్రీనివాస్‌గౌడ్, కాంటెస్ట్డ్ కార్పొరేటర్ సీఎల్ యాదగిరి, డీసీసీ జాయింట్ సెక్రెటరీ సూర్యప్రకాశ్, 133 డివిజన్ ప్రెసిడెంట్ ఎ.పవన్, 134 డివిజన్ ప్రెసిడెంట్ సూర్యప్రకాశ్‌రెడ్డి, 135 డివిజన్ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసులు, 137 డివిజన్ ప్రెసిడెంట్ సంతోష్‌కుమార్, 138 డివిజన్ ప్రెసిడెంట్ జీ.వంశీ ముదిరాజ్, మీడియా సెల్ కన్వీనర్ జీ.రాంచందర్, అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాసు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ అలీ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, 137 డివిజన్ కార్యదర్శి సాయిరాం, 133 డివిజన్ మహిళా అధ్యక్షురాలు ఫహీం, 139 డివిజన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్తర్, 134 డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు హరికుమార్, 140 డివిజన్ మహిళా అధ్యక్షురాలు నవనీత, 140 డివిజన్ సెల్ ప్రెసిడెంట్ రాములు బీఆర్ఎస్లో చేరారు.