సైదాబాద్, నవంబర్ 4: ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కవిత తీర్పు చెప్పారని సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బరామి రెడ్డి తెలిపారు. సైదాబాద్ చింతల్‌కు చెందిన వినోద్ 2017లో తన నివాసానికి సమీపంలో ఉంటున్న ఎనిమిదేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. కేసు దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయస్థానం లైంగిక దాడి, పోక్సో చట్టం కింద నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పిందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.