Hyderabad | హైదరాబాద్ : ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థులు చేసిన వికృత చేష్టలతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
కొత్తపేటకు చెందిన విద్యార్థి(14) నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆగస్టు 29వ తేదీన సదరు విద్యార్థి పుట్టిన రోజు కావడంతో.. తోటి ఫ్రెండ్స్ లంచ్ సమయంలో సరదాగా చేసిన చేష్టలతో ఆ విద్యార్థి మర్మంగానికి గాయమై రక్తస్రావమైంది.
విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ హుటాహుటిన బాధిత విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం పేరెంట్స్‌కు సమాచారం అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థికి సర్జరీ చేయడంతో ప్రాణపాయం తప్పింది. అయితే విద్యార్థి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా దాడి చేసిన విద్యార్థులపై, పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారు. దీంతో నాచారం సీఐని బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సీఐ రుద్వేర్ కుమార్ స్థానంలో కొత్త సీఐగా ధనుంజయ్‌ను నియమించారు.