మన్సూరాబాద్, అక్టోబర్ 19: కందుకూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 16న జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. సెల్ఫోన్లో లభించిన క్లూతో నిందితుడిని పట్టుకున్నారు. లైంగికదాడికి యత్నించే క్రమంలో వృద్ధురాలిని హ త్యచేసి.. ఆపై ఆమె భర్తను హత్యచేసినట్లు తేలింది. ఈ కేసులో నిందితుడి ఫ్రింగర్ ప్రింట్‌ను పరిశీలించగా.. సంవత్సరంన్నర క్రితం జరిగిన మరో మహిళ హత్య విషయం బయటపడింది. ఈ హత్య కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలం, ముస్తిపల్లి గ్రామానికి చెందిన మూగ ఊశయ్య (70), మూగ శాంతమ్మ (65) దంపతులు.. అదే గ్రామానికి చెందిన మనోహర్‌కు చెందిన కందుకూరు, కొత్తగూడ గ్రామ పరిధిలో ఉన్న మామిడితోటలో పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. ఈనెల 16న ఉదయం ఆ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా హత్యకు గురైన ఊశయ్య సెల్‌ఫోన్‌కు వచ్చిన ఇన్కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను పరిశీలించారు. ఇందులో లభించిన సమాచారం మేరకు కందుకూరు మండలం, దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివకుమార్ (25)పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య విషయం బయటపడింది. మనోహర్‌కు చెందిన మామిడి తోటలో మూడు ఎకరాలను కందుకూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తి కౌలుకు తీసుకుని సాగుచేస్తున్నాడు.
మామిడితోటకు శివకుమార్‌ను బోరు పని కోసం మహేశ్ తీసుకువస్తుండేవాడు. ఈ క్రమంలో శివకుమార్ చూపు వృద్ధ దంపతులపై పడింది. ఒంటరిగా ఉంటున్నట్టు గుర్తించి.. ఈనెల 15న రాత్రి మామిడితోటకు వచ్చి శాంతమ్మపై లైంగి క దాడికి యత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుగా వచ్చిన ఆమె భర్త ఊశయ్యను సైతం హత్య చేసి పరారయ్యాడు.
శుక్రవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో నేడునూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఉప్పుల శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వృద్ధ దంపతులను హత్య చేసిన అనంతరం ఫుల్‌గా మద్యం సేవించి ఉన్న శివకుమార్‌కు తన సెల్‌ఫోన్ కనిపించలేదు. దీంతో హత్యకు గురైన ఊశయ్య సెల్‌ఫోన్ నుంచి తన సెల్‌కు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. మద్యం మత్తులో ఉన్న శివకుమార్ తన సెల్‌ఫోన్ ఇంట్లో పెట్టి వచ్చిన విషయాన్ని మరచి.. ఊశయ్య సెల్‌ఫోన్ నుంచి ఫోన్ చేయడంతో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడు శివకుమార్ ఫింగర్ ప్రింట్ చూడగా.. సంవత్సరంన్నర క్రితం జరిగిన మహిళ హత్య కేసులో లభించిన ఫింగర్ ప్రింట్ ఒక్కటేనని తెలిసింది .
దంపతుల హత్య కేసును లోతుగా విచారణ చేపట్టిన కందుకూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మద్యానికి బానిసగా మారిన ఉప్పుల శివకుమార్ తాగిన మైకంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుని హత్యలు చేస్తున్న విషయం బయటపడింది. ఏపీ, నెల్లూరు జిల్లా, ఒజిలి మండలం, మనవల్లి గ్రామానికి చెందిన నరేందర్‌రెడ్డి తన భార్య శైలజారెడ్డి (42), కుమారుడు క్రిష్ణారెడ్డితో కలిసి కందుకూరు మండలం, దాసర్లపల్లి గ్రామంలోని అరుణ ఫాంహౌజ్‌లో నివాసముండేవారు. కాగా.. 03-03-2023న రాత్రి 7:50 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న శైలజారెడ్డిపై ఉప్పుల శివకుమార్ లైంగికిదాడికి యత్నించగా.. ఆమె ప్రతిఘటించడంతో యాక్సా బ్లేడుతో గొంతు కోసి హత్య చేసి ప రారయ్యాడు. నాటి నుంచి శివకుమార్ పరారీలో ఉన్నాడు.
హత్య జరిగిన ప్రాంతం వద్ద లభించిన యాక్సా బ్లేడుపై లభించిన నిందితుడి ఫింగర్ ప్రిం ట్లను పోలీసులు సేకరించారు.. అయితే… వృద్ధ దంపతుల హత్య కేసులో అరెస్ట్ అయిన శివకుమార్ ఫింగర్ ప్రింట్‌ను పోల్చి చూడగా.. శైలజారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు బైకు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.