సిటీ బ్యూరో, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు. ఎండలు ముదురుతుండటంతో ఏర్పడుతున్న నీటి కొరతను సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజల ఇబ్బందులను తమకు అనుకూలంగా మార్చుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నీటి కొరత తీవ్రం అవుతున్నందున సమయానికి అవసరమైన నీరు రావడమే చూసుకుంటున్న ప్రజలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయని చూడటం లేదు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు రెచ్చిపోతున్నారు.
ఎక్కడపడితే అక్కడ మురుగు నీటిని ట్యాంకర్లలో నింపుకొస్తున్నారు. ఏకంగా మూసీ మురుగు నీటిని మోటార్ల ద్వారా ట్యాంకర్లలో నింపుకొని సరఫరా చేస్తున్నారు. గండిపేట, హిమాయత్‌సాగర్ పరిసరాల్లో మూసీ, ఈసా నదుల నుంచి నీటిని తోడుతున్నారు. బహిరంగంగానే రోడ్లపై ట్యాంకర్లను నిలిపి మోటార్లతో నీటిని నింపుతున్నారు. తాజాగా హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ కింద రాజేంద్రనగర్ ఔటర్ రింగ్‌రోడ్డు ఎగ్జిట్‌కు సమీపంలో రోడ్డుపై ట్యాంకర్ నిలిపి మోటార్‌తో నీటిని తోడుతున్నారు. ఈ వ్యవహారం నిత్యం జరుగుతూనే ఉంది.
కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఏకంగా హెచ్ఎండీఏ అధికారులు చెప్తేనే ఆ నీటిని తోడుతున్నామని ట్యాంకర్ నిర్వాహకులు చెబుతుండటం విస్తుగొలుపుతున్నది. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులకు అధికారులే అండగా ఉంటూ అక్రమాలను ప్రోత్సహిస్తుండటంతో వాళ్లు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధికారుల అండదండలు ఉండటంతో అడిగేవారే లేరని బరితెగిస్తున్నారు. మురుగు నీటిని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్యాంకర్లకు కొమ్ముకాయకుండా తనిఖీలు చేపట్టి మురుగు నీటి సరఫరా అడ్డుకుని అక్రమార్కుల ఆగడాలను నియంత్రించాలని నగర ప్రజలు కోరుతున్నారు. రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఏర్పడి ట్యాంకర్ల వినియోగం పెరుగనున్నది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ట్యాంకర్లపై నిఘా పెట్టి మురుగు నీటిని సరఫరా చేయకుండా ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.
జనంపై లోగోలు..
నగరంలో కొంత మంది ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు వాహనాలపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి లోగోల స్టిక్కర్లు పెట్టుకుని రోడ్లపై తిప్పుతున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లపై ఆ లోగోలు దర్శనమిస్తున్నాయి. పోలీసులు, రెవెన్యూ అధికారుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నట్లు ట్యాంకర్ల డ్రైవర్లే స్వయంగా చెప్తుండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అలా విచ్చలవిడిగా ట్యాంకర్లపై లోగోలు పెట్టుకుంటున్నా కనీసం పట్టించుకోకపోవడం మున్సిపల్, హెచ్ఎండీఏ, జలమండలి అధికారుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. వాహనాలకు ఫిట్నెస్ లేకున్నా, సరైన పత్రాలు లేకున్నా ఇలా అక్రమ మార్గంలో నడుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
ప్రభుత్వం, అధికారుల కండ్లు కప్పుతూ ఎండాకాలం సీజన్లో లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. నీటిని ఇష్టారీతిన తోడేస్తూ భూగర్భ జలాలను జలగల్లాగా పీలుస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు, బహుళ అంతస్తుల భవనాల యజమానులకు నిర్మొహమాటంగా తాము హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పర్మిషన్తో నీటిని సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు. వారికి నమ్మకం కలిగేందుకు వాహనంపైనున్న లోగోలను చూపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల సరఫరా చేస్తుండటంతో నీటి నాణ్యతపై వారు భరోసాగా ఉంటున్నారు. అలా లోగో ఉన్న వాహనాలకు ప్రాధాన్యం ఇస్తూ నీటిని కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని అక్రమార్కులు విచ్చలవిడిగా ప్రుభుత్వ లోగోలను దుర్వినియోగం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమంగా ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. ఎండాకాలం సీజన్ పూర్తయ్యేదాకా నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులను నిలువరించాలని అభ్యర్థిస్తున్నారు.