ఉమ్మడి రాష్ట్రం మొదలు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు హైదరాబాద్ నగరాభివృద్ధి చరిత్రలో కాంగ్రెస్ సర్కార్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసుకున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర సంవత్సరాలు దాటినా.. చెప్పుకోవడానికి పేర్చిన ఇటుక లేదు.. చూపించేందుకు కొత్త ప్రాజెక్టు
కనిపించదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల పేర్లు మార్చి వాటికి బడ్జెట్లలో కేటాయింపులు కొనసాగించడం మినహా ఒక్కటంటే.. ఒక్క కొత్త ప్రాజెక్టు నగరంలో పురుడుపోసుకోకపోవడం గమనార్హం. శుక్రవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో
‘మా ప్రభుత్వం వచ్చిన ఫలానా ప్రాజెక్టు చేపట్టాం.. పూర్తి చేశాం..లేదా కనీసం ప్రాజెక్టు పనుల్ని ఈ దశకు తెచ్చాం’ అని చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం పదాల ఆర్భాటం.. ప్రచారం ఉత్సాహం తప్ప. గొప్పగా నగరాన్ని అవుటర్ రింగు రోడ్డు వరకు విస్తరించి చరిత్ర సృష్టించామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం విస్తరించిన నగరానికి సైతం చిల్లిగవ్వ విదల్చలేదు. ఎలివేటెడ్ కారిడార్.. మెట్రో రెండో దశ ప్రాజెక్టుల శిలాఫలకాలు చిన్న బోతుండగా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు మాత్రం రూ.1500 కోట్ల కేటాయింపులతో పరీవాహక ప్రాంత ప్రజల గుండెల్లో మరోసారి రైళ్లను పరిగెత్తించింది. ముఖ్యంగా నగరాభివృద్ధికి రూ. పది వేల కోట్లు అంటూ.. గడిచిన రెండు సంవత్సరాల్లో అందులో పావు వంతు నిధులను సైతం ఖర్చు చేయకుండా మరోసారి అదే అంకెల గారడీతో విశ్వనగరాభివృద్ధిని మమ అనిపించారు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 20 (నమస్తే తెలంగాణ)
రెండున్నర సంవత్సరాలుగా హైదరాబాద్ మహానగర పరిధిలో కూల్చివేతలతో విధ్వంసం సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈసారి బడ్జెట్లోనూ నగర వికాసాన్ని విస్మరించింది. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను 1956 చదరపు కిలోమీటర్లకు విస్తరించడం… ఆపై మూడు ముక్కలుగా చేయడం తప్ప..శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపులను అటకెక్కించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి (ఎస్ఆర్డీపీ) హెచ్-సిటీగా పేరు మార్చి దానికి మాత్రమే నిధులను కేటాయించారు. రెండు సంవత్సరాలుగా హెచ్-సిటీ ప్రాజెక్టుకు కేటాయింపులు చేస్తున్నప్పటికీ పాత బిల్లులు చెల్లించడం మినహా కొత్త ఫ్లైఓవర్, ఆర్యూబీ, ఆర్వోబీల ఊసు మాత్రం లేదు. ఆ పరంపరలో భాగంగానే ఈసారి కూడా హెచ్-సిటీకి రూ.2,675 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొన్నారు. కానీ విస్తరించిన నగరంలో మౌలిక వసతులకు చిల్లిగవ్వ కేటాయింపులు చేపట్టలేదు. దీంతో సర్కారు విస్తరణ వ్యూహం జనం ముక్కుపిండి వసూలు చేయడం మినహా అభివృద్ధి ఫలాల్ని అవుటర్ రింగు రోడ్డు వరకు విస్తరింపజేయాలని కాదనేది రుజువైంది.
గతమెంతో ఘనంగా హెచ్ఎండీఏ దుస్థితి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులకే కేంద్ర బిందువుగా ఉండేది. ఏటా వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర ఆర్థిక ఇంజిన్‌కు సైతం ఊతంగా నిలిచేది. కానీ రెండున్నర సంవత్సరాల్లో పరిస్థితి తారుమారైంది. సొంత ఆదాయం కోల్పోయి.. సర్కారు సైతం నిధులివ్వక శిలాఫలకాలతో కాలం వెళ్లదీస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన ప్రధానంగా సికింద్రాబాద్ నుంచి ఉత్తర తెలంగాణకు అనుసంధాన ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రతిపాదనలు రూపొందించింది. రక్షణ శాఖ భూముల క్లియరెన్స్ కోసం తీవ్ర కృషి చేయగా, చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆదిలోనే కేంద్రం నుంచి అనుమతి వచ్చింది. ఆ ప్రక్రియను తమ ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆపై రూ.5వేల కోట్లకు పైగా అంచనా విలువతో ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేసింది. కానీ ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు ముందుకు కదిలిందీ లేదు… పట్టాలెక్కిందీ లేదు. పైగా ఈసారి బడ్జెట్లోనూ అసలు ఆ పదాలే ఎక్కడా కనిపించలేదు. సుమారు రూ.680 కోట్ల అంచనా విలువతో ప్రతిపాదించిన శిల్పా లేఅవుట్ ఎక్స్‌ప్రెస్‌వే, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లకు సైతం ఈ బడ్జెట్లో కేటాయింపులు గుండుసున్నా.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన హైదరాబాద్ మెట్రో మొదటి దశ తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం కోసం ఎయిర్‌పోర్టు మెట్రోను పట్టాలెక్కించారు. కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రద్దు చేసి ఆర్భాటంగా రెండో దశను ప్రకటించింది. కేంద్రానికి డీపీఆర్ పంపి చివరకు మొదటి దశను టేకోవర్ చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంది. ఆ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. అయితే మెట్రో రెండో దశకు శంకుస్థాపన సీఎం రేవంత్‌రెడ్డి పాతబస్తీ మెట్రోను పరుగులు పెట్టిస్తామంటూ అనేక సార్లు ప్రకటనలు చేశారు. కానీ తాజా బడ్జెట్లో చూస్తే మాత్రం భూసేకరణ దశలో ఉన్న పాతబస్తీ మెట్రోకు మొండిచేయి చూపారు. కానీ మొదటి దశ టేకోవర్ పూర్తయి… కేంద్రం నుంచి అనుమతి వచ్చి.. వేల కోట్ల రుణాలపై స్పష్టత వచ్చిన తర్వాత గానీ పట్టాలెక్కని రెండో దశ కు మాత్రం రూ.600 కోట్లు కేటాయించారు. అంటే పనులు చేయాల్సిన పాతబస్తీని పక్కనపెట్టి పట్టాలెక్కని రెండో దశకు కేటాయింపు లు చేశారంటేనే నిధులు ఇవ్వాల్సిన అవసరంలేదనే వ్యూహం ఉందని అర్థమవుతున్నది.
హైదరాబాద్ నగరాభివృద్ధిపై తొలి ఏడాదిలోనే బోర్లా పడిన రేవంత్ సర్కారు తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో గొప్పలకు పోలేదుగానీ పాత లెక్కలనే తిరగేసి మమ అనిపించినట్లు తేటతెల్లమైంది. జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండీఏ, హైదరాబాద్ మెట్రో, హెచ్‌ఆర్‌డీసీఎల్‌కు సరిగ్గా గత సంవత్సరం ఎలాంటి కేటాయింపులు చేశారో ఇప్పుడు కూడా అవే అంకెలు కనిపించాయి. కానీ ఆయా విభాగాల పరిధుల్లో కొత్తగా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను భుజానికెత్తుకున్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టును రూ.24వేల కోట్లతో ఏకంగా డీపీఆర్‌ను సిద్ధం చేయగా మరో రూ.20వేల కోట్ల విలువైన మేడ్చల్ మెట్రోకు సైతం సర్వేను మొదలుపెట్టారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) కింద శరవేగంగా జరిగిన ఫ్లైఓవర్లు, వంతెనల నిర్మాణాల పనులు గతేడాది కాలంగా పడకేశాయి. ఇవే పనుల ప్రతిపాదనలతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్ఆర్డీపీ పేరు మార్చి హెచ్సిటీగా నామకరణం చేసింది. కానీ ఏడాది కాలంగా సగం నిధులు కూడా విడుదల చేయలేదు. పైగా తాజా బడ్జెట్లోనూ గతేడాది కేటాయింపులతో సరిపెట్టిన ప్రభుత్వం అదనంగా ఫ్యూచర్ సిటీలోని 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రహదారి భారాన్ని సైతం ఈ కార్పొరేషన్‌పై మోపింది. ఇక… రాష్ట్రంలోని ప్రతి నిరుపేదకు సూపర్‌స్పెషాలిటీ సేవలను అందించే సర్కారు దవాఖానలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నగరం నలుమూలలా మొదలైన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణానికి కాంగ్రెస్ సర్కారు నయాపైసా ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది. పైగా ఉస్మానియా ఆస్పత్రికి రూ.2400 కోట్లు కేటాయించామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్పినప్పటికీ కేటాయింపుల్లో అది నల్లపూస కావడం సర్కారు చిత్తశుద్ధికి నిదర్శనం.
