Musi River | ఎన్నో ఏండ్ల కష్టం.. జీవిత కాలం శ్రమ.. పైసా పైసా కూడబెట్టి.. లక్షలు అప్పు చేసి.. నిర్మించుకున్న సామాన్యుల ‘కలల’ గృహాలు ‘మూసీ సుందరీకరణ’కు బలి కానున్నాయా..?..ఒకటి కాదు.. రెండు కాదు.. లక్షన్నర వరకు నిర్మాణాలు నేలమట్టం అవుతాయా.. ? ఇప్పుడు నగరవాసులను తొలుస్తున్న ప్రశ్నలివి. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్డీసీఎల్) రూపొందించిన గూగుల్ మ్యాప్ చూస్తే.. ఇంకెందరి బతుకులు ఆగమవుతాయోనన్న భయం వేస్తున్నది.
మ్యాప్‌లో కేవలం ఎఫ్ఆర్ఎల్ (ఫుల్ రివర్ లెవల్) గీతలోపే పుట్టగొడుగుల్లా నిర్మాణాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం అక్కడి నుంచి బఫర్ జోన్‌ను లెక్కిస్తే..దాని పరిధిలోకి వచ్చే కట్టడాలు ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్న అడుగుల తీరు లక్షలాది సామాన్యుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తున్నాయి. ఇటీవలే పరీవాహక ప్రాంతాల్లో 150 వరకు ఇండ్లు నేలమట్టం చేశారు.
ఆ బాధితుల రోదన.. ప్రస్తుతం వారు పడుతున్న అవస్థలు చూస్తుంటే.. ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తున్నది. ఎంఆర్డీసీఎల్ అధికారులు రూపొందించిన మ్యాపులో అవుటర్ రింగు రోడ్డు వరకు నది ప్రవాహ మార్గం దాదాపు 54 కిలోమీటర్ల మేర ఉంది. ఆ పరిధిలో లక్షన్నర వరకు నిర్మాణాలు కూడా ఉండొచ్చని మూసీపై అధ్యయనం చేస్తున్న నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. కానీ అధికారులు మాత్రం ప్రస్తుతం కేవలం రివర్ బెడ్‌కు మాత్రమే పరిమితమవుతామంటున్నారు. అయితే మూసీ నిర్మాణాలపై సర్కారు దమనకాండ ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మున్ముందు అడుగులు ఎలా ఉంటాయనేది సమాధానం లేని ప్రశ్నే.
-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 3 ( నమస్తే తెలంగాణ )
ఇదీ మూసీ రివర్ ఫ్రంట్ రూపొందించిన మ్యాప్ఎర్ర గీత : రివర్ బెడ్
నీలం గీత : ఎఫ్ఆర్ఎల్
బఫర్‌జోన్ స్థలాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే 30 మీటర్ల వరకు ఉన్న ఇండ్లనూ తీసేయాల్సిందే